Idream media
Idream media
సమాజం సర్వతోముఖాభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలికల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బాల్య వివాహాల చట్టం, వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాలలో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకురావాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.
ఇతర అంశాలు ఎలా ఉన్నా.. బాలికల వివాహ వయస్సును పెంచాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి యావత్ భారతం మద్ధతు తెలుపుతుంది. ఈ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని కచ్చితంగా మెచ్చుకోకుండా ఉండలేం. బాలికల వివాహ వయస్సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచడం వల్ల.. కులాలు, మతాలతో సంబంధం లేకుండా యావత్ భారత సమాజం అన్ని విధాలుగా వృద్ధి చెందుతుంది.
ప్రస్తుతం బాలికల వివాహ వయస్సు 18 కాగా, బాలుర వివాహ వయస్సు 21. దీని వల్ల ఆడపిల్లలకు 18 ఏళ్లు రాగానే వివాహం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 18 ఏళ్లు నిండకపోయినా చేస్తున్నారు. సమాచారం తెలిస్తే.. అధికారులు వెళ్లి అడ్డుకుంటున్నారు. కానీ అడ్డుకోలేని వివాహాల సంఖ్యే ఎక్కువ. చిన్న వయస్సులోనే వివాహం చేయడం వల్ల.. బాలికల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోంది. అది అంతిమంగా ఆ కుటుంబానికి తీరని నష్టం చేకూరుస్తోంది. భార్యాభర్తల జీవితాలే కాకుండా.. వారి పిల్లల జీవన విధానం కూడా దెబ్బతింటోంది.
Also Read : తెలుగు రాష్ట్రాలపై ప్రధాని ఫోకస్.. భారీ సభకు ఏపీ బీజేపీ ప్లాన్..!
21 ఏళ్లకు వివాహ వయస్సు పెంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆడ పిల్లల చదువుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. 16 ఏళ్లకే పదో తరగతి పూర్తవుతుంది. ఆ తర్వాత మరో రెండేళ్లకు.. అంటే 18 ఏళ్లకు ఇంటర్ పూర్తవుతుంది. మరో మూడు, లేదా నాలుగేళ్లకు డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేదల కుటుంబాల్లోని ఆడపిల్లలను ప్రస్తుతం పదో తరగతి తర్వాత చదువు మాన్పిస్తున్నారు. రెండేళ్లు ఇంటిపని, పొలం పనికి పంపించి.. ఆ తర్వాత పెళ్లి చేస్తున్నారు. రెండేళ్ల సమయం తక్కువే కావడంతో.. కొంత మంది తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తున్నారు. వివాహ వయస్సు 21 ఏళ్లు అయితే.. పదో తరగతి తర్వాత పెళ్లికి ఐదేళ్ల విరామం ఉంటుంది. అన్నేళ్లపాటు ఆడపిల్లలను ఇంట్లో ఉంచేందుకు తల్లిదండ్రులు ఇష్టపడరు. అప్పుడు కచ్చితంగా చదివిస్తారు.
వివాహ వయస్సు పెంచడం వల్ల ప్రతి ఆడపిల్ల పట్టభద్రురాలు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. చదువుకోవాలన్న ప్రతి అమ్మాయి తన కల సాకారం చేసుకుంటుంది. చదువుకున్న ఆడపిల్లకు ఉద్యోగం చేసే అర్హత లభిస్తుంది. సంపాదించే శక్తి ఉన్న మహిళ వల్ల ఆ కుటుంబానికి ఎంతగానో ఆసరా లభిస్తుంది. పిల్లల పెంపకం, వారి చదవులు ఉన్నతంగా ఉంటాయి. ఒక కుటుంబం ఉన్నతంగా ఉంటే.. అంతిమంగా అది సమాజ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. ఆడపిల్లల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచడం వల్ల.. తదుపరి తరానికి ఉన్నతమైన జీవితం లభిస్తుందనడంలో సందేహం లేదు.
అయితే.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తేనే ఈ నిర్ణయానికి తగిన ఫలం ప్రజలకు అందుతుంది. లేదంటే.. పిల్లల విద్య కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.
Also Read : ఓబీసీ కులగణన లేనట్లే..నా? కేంద్రం ఏం చెప్పింది.. ఏం చేస్తోంది.?