Finance Minsiter -నేడు సీతారామ‌న్ స‌మావేశం :సంస్కరణల ఆధారిత వ్యాపారం ఎలా ఉండ‌నుందో?

కొవిడ్ అనంత‌రం ఎప్పుడైనా కేంద్రం సంస్క‌ర‌ణ‌లు అంటే.. ఆయా రాష్ట్రాలు భ‌య‌ప‌డే ప‌రిస్థితులు దాపురించాయి. ఎందుకంటే.. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో మెజార్టీ రాష్ట్రాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డం క‌న్నా ఇబ్బంది క‌లిగించేవే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేయ‌డం, కొవిడ్ బాధితుల‌కు ప‌రిహారం రాష్ట్రాల‌పై నెట్టేయ‌డం, అలాగే ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గించే బాధ్య‌త కూడా వాటికే అప్ప‌గించ‌డం.. వంటి నిర్ణ‌యాలు ప‌లు రాష్ట్రాల‌ను మ‌రింత ఆర్థిక క‌ష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఈ క్ర‌మంలో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దేశ వృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్న‌ట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. సంస్క‌ర‌ణ‌ల ఆధారిత అన‌గానే ఇప్పుడేం చేస్తారో అన్న టాక్ న‌డుస్తోంది.

నిన్న‌నే తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రుల‌తో స‌మావేశం అయ్యారు. నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా వ‌ర్చువ‌ల్ గా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. నవంబర్ 15న జరిగే ఈ వర్చువల్ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్ కూడా పాల్గొంటారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పెట్టుబడులను పెంచేందుకు అనువైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ఈ సమావేశం ఎజెండా. అంతే కాకుండా వృద్ధిని ప్రోత్సహించే చర్యలు, సంస్కరణలు, పెట్టుబడి ప్రోత్సాహం మరియు సంస్కరణ ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

కరోనా మహమ్మారి రెండు విడతలుగా విరుచుకుపడి దేశం వ్యాప్తంగా కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా పునరుద్ధరణ, మూలధన వ్యయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు, కేంద్ర ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ గత వారం మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో సమస్యలు, అవకాశాలు మరియు సవాళ్లు చర్చకు కేంద్రంగా ఉంటాయి, దీని ద్వారా మనం అధిక పెట్టుబడులు మరియు వృద్ధిని సాధించగలమన్నారు. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని భరిస్తోందని, ప్రైవేట్ రంగం నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. అయితే అది ఇంకా పెద్ద ఎత్తున నిజమైన పెట్టుబడిగా మారలేదని కార్యదర్శి చెప్పారు. అయితే, మూలధన వ్యయం భారీ పెట్టుబడికి మరింత తోడ్పాటు అవసరమన్నారు.

పెట్టుబ‌డులు, మూల ధ‌నం కోసం కేంద్రం ఈ స‌మావేశంలో ఎటువంటి నిర్ణ‌యాలు ప్ర‌క‌టిస్తుంద‌నే ఆస‌క్తి ఏర్ప‌డింది. స‌మావేశం నేప‌థ్యంలో ఇప్ప‌టికే కొంద‌రు ముఖ్య‌మంత్రులు ప‌లు అంశాల‌ను సిద్ధం చేసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రి ముందు నిధుల అంశాన్ని లేవ‌నెత్తి క‌రోనా అనంత‌రం రాష్ట్ర ప‌రిస్థితుల‌ను వివ‌రించేందుకు సిద్ద‌మ‌య్యారు. అలాగే ఇటీవ‌ల కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌భావం ఆయా రాష్ట్రాల‌పై ఎలా ఉందో తెలియ‌జేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. కాగా, సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించేందుకు కేంద్రం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుందో తెలియాలంటే నిర్మ‌ల‌మ్మ చెప్పే వ‌ర‌కూ ఆగాల్సిందే.

Also Read : Southern Council Amit Sha -దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం, జగన్ ఎజెండా ఇదే

Show comments