Idream media
Idream media
బతుకు పోరాటంలో అన్నదాత గెలిచాడు. నూతన సాగు చట్టాలను తెస్తూ.. వ్యవసాయాన్ని కార్పొరేట్ పరం చేయాలని చూసిన కేంద్ర ప్రభుత్వ మెడలను మొక్కవోని దీక్షతో వంచాడు. చలి, ఎండ, వానలతోపాటు ఉగ్రవాదులు, అసాంఘిశక్తులు అంటూ చేసిన విమర్శలను, కుట్రలను జయించి.. వ్యవసాయం చేజారిపోకుండా కాపాడుకున్నారు. సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. రైతుల పట్టుదల ముందు తలవంచక తప్పలేదు.
మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ నెల 19వ తేదీన ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ మేరకు ఇటీవల కేబినెట్‌లో తీర్మానాన్ని ఆమోదించారు. తాజాగా ఈ రోజు సోమవారం మొదలైన పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే.. చట్టాలను వెనక్కి తీసుకునే బిల్లును బీజేపీ ప్రభుత్వం సభలకు ముందుకు తెచ్చింది. లోక్‌సభలో చట్టాల రద్దు బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఇక రాజ్యసభ ఆమోదమే మిగిలి ఉంది.
విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యనే..
ఈ రోజు ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో సభ వాయిదా పడింది. తిరిగి 12:30 గంటలకు సభ ప్రారంభం కాగానే.. సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సమయంలోనూ విపక్ష పార్టీలు కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత అంశంపై డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు. విపక్ష పార్టీల ఆందోళనల మధ్యనే సాగు చట్టాల రద్దు బిల్లును లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.
మంచిదని కేంద్రం.. కాదని రైతులు..
వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకంటూ కేంద్రం మూడు చట్టాలను తెచ్చింది. దీనిలో మొదటిది రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టం కాగా, రెండవది ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల ఒప్పంద చట్టం. ఇక మూడవది నిత్యావసర సరుకుల చట్టం. గత ఏడాది జూన్ 6వ తేదీన కేంద్రం మూడు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చింది. సెప్టెంబరు 17న లోక్‌సభలోను, 20న రాజ్యసభలో ఆమోదించింది.
అదే నెల 25 నుంచి ఈ బిల్లుల మీద దేశవ్యాప్త ఆందోళన మొదలైంది. ఈ మూడు చట్టాల వల్ల దళారీ వ్యవస్థ తగ్గుతుందని కేంద్రం చెప్పగా, ఈ బిల్లు వల్ల రైతులు మనుగడ కోల్పోతారని ఆందోళనకారుల వాదన. ముఖ్యంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థకు ఈ చట్టం ముగింపు పలుకుతుందని రైతులు ఆరోపించారు. గత ఏడాది నవంబరు 25 నుంచి ఆందోళన హోరెత్తింది. ఢిల్లీ ముట్టడి, ఎర్రకోట వద్ద ఆందోళనలతో దేశరాజధాని అట్టుడికింది. ఎండనక, చలి అనక.. వాన అనక రోడ్ల మీద పడి రైతులు మడం తిప్పని పోరాటం చేశారు. ఎంతోమంది రైతులు మృత్యువాతపడ్డారు. ఏడాది నుంచి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు.
కేవలం పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే ఉద్యమిస్తున్నారనే విమర్శలు వచ్చినా వారు వెనుదిరగలేదు. పోరాటంలో ఇతర అసాంఘిక వ్యక్తుల ప్రవేశం వంటి ఆరోపణలు వచ్చినా రైతులు వెన్నుచూపలేదు. ఉద్యమం మొదలై ఈ నవంబరు 26 నాటికి ఏడాదైంది. ఇదే సమయంలో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆరంభంలో కీలకమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల నేపథ్యంలో కేంద్రం వెనకడుగు వేసిందనే విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేశాయి.
Also Read : AAP, Punjab Elections – ఊడ్చేయనుందా..? నాలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న ఆప్..!