పీఆర్‌సీపై కోర్టులో పిటీషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పీఆర్‌ సీ పై వివాదం కొనసాగుతోంది. పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య పిటీషన్‌ దాఖలు చేశారు. కొత్త పీఆర్‌సీ జీవోల ద్వారా సర్వీస్‌ బెనిఫిట్స్‌ తగ్గుతాయని కృష్ణయ్య తన పిటీషన్‌లో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్‌ తగ్గకూడదని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. విభజన చట్టం సెక్షన్‌ 78(1)కు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఉన్నాయన్న ఆయన.. ఆ జీవోలను రద్దు చేయాలని కోరారు. ఈ పిటీషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

కాగా, నూతన పీఆర్‌సీతో ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జీతాలు తగ్గుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని బుధవారం మీడియా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ చెప్పారు. ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పీఆర్‌సీ అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. కొత్త పీఆర్‌సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్‌ ఆధారంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించింది.

Also Read : కొత్త పీఆర్‌సీ.. జీతాలు.. ఉద్యోగుల ఆందోళన – సీఎస్‌ సమీర్‌ శర్మ క్లారిటీ

Show comments