Idream media
Idream media
ప్రభుత్వం ఒకటి తలిస్తే.. ప్రతిపక్షం అందుకు విరుద్ధంగా తలుస్తుంది. అదే రాజకీయం. తెలంగాణలో ఇప్పుడు అలాంటి రాజకీయమే నడుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని బీజేపీనే కాకుండా ఏకంగా జాతీయ స్థాయిలోనే ప్రభావితమయ్యేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి చనిపోయిన రైతు కుటుంబాల్లో ఒక్కో దానికి రూ. 3 లక్షల ప్రకటన. దీని ద్వారా రైతులపై తమకు ఎంత ప్రేముందో చాటాలని కేసీఆర్ భావించారు. అయితే ఇప్పుడా ప్రకటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ వేసిన స్కెచ్ దోహదం చేయనుంది. దీంతో ఆ రాష్ట్రాల వారికి రూ.3లక్షల సాయం కేసీఆర్ కు వరమా? శాపమా? అనే చర్చ మొదలైంది.
కేసీఆర్ అనుకుంటే వెనుకా ముందు ఆలోచించకుండా సాయాన్ని ప్రకటించటంలో మొదటి నుంచీ ఒకటే తీరు. ప్రభుత్వాల నుంచి సాయం అందాలంటే పోరాటాలు చేయాలి.. నిరసనలు చేయాలి. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అలాంటి వాటికి అస్సలు అవకాశం ఇవ్వరు. ఇదంతా ఒక ఎత్తయితే.. వ్యవసాయ చట్టాల రద్దును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించి.. ఆ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3లక్షల సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన విన్నంతనే కేసీఆర్ రాజకీయ చతురతకు ముచ్చటపడకుండా ఉండలేం. ఏం కొట్టారండి దెబ్బ అన్న భావన కలగటం ఖాయం. అయితే ఇప్పుడు బీజేపీ లేవనెత్తుతున్న వివాదాలు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.
వేదనతో కళ్లెదురుగా రోదిస్తున్న వాళ్ళను గాలికి వదిలేసి లోకాన్ని ఉద్ధరించడానికి వెళతానన్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో జరిగిన ఉద్యమాల్లో మరణించిన రైతు కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున సాయాన్ని ప్రకటించిన కేసీఆర్‌కు సొంత రాష్ట్రంలో ప్రాణాలు పోగొట్టుకున్న వేలాది మంది రైతు కుటుంబాలు గానీ, ఆయన వల్ల నడిరోడ్డున పడి ఏడుస్తున్న రైతులు గానీ ఏమాత్రం కనిపించడం లేదా అన్నారు. తెలంగాణ సర్కారు విధానాల వల్ల వరి, మక్క, శనగ రైతులు తమ పంటలకు మంటలు పెట్టుకున్నప్పుడు కూడా కేసీఆర్‌కు రైతుల గోడు పట్టలేదంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాల్ని అర్పించిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో సాయం అందలేదన్న విమర్శలను కూడా లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఇదే అదునుగా అమరవీరుల కుటుంబాలు ఇప్పుడు తమ గొంతు విప్పే అవకాశం ఉంది. కేసీఆర్ ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో గతంలోనే శ్రీకాంతాచారి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి సాయం ప్రకటనపై స్థానికంగా ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలు గొంతెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు అంతగా పట్టించుకోకపోయినా, విపక్షాలైనా రాద్దాంతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
Also Read : Centrla Government ,Compensation To Farmer’s – రైతు కుటుంబాలకు త్వరలోనే పరిహారం ప్రకటన..?