Chandrababu Delhi Tour-చంద్ర‌బాబుకు ఇప్ప‌టికైనా అర్థ‌మైన‌ట్లేనా?

రాష్ట్రంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నను రాజ‌కీయంగా త‌న‌కు అనువుగా మార్చుకునేందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబునాయుడు చేయాల్సిందంతా చేశారు. ఓ పార్టీ ఆఫీసుపై దాడిని నేప‌థ్యంగా చేసుకుని ఏకంగా రాష్ట్రప‌తి పాల‌న డిమాండ్ వ‌ర‌కు వెళ్లిపోయారు. రాష్ట్రప‌తిని కూడా క‌లిశారు. బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై ర‌క‌ర‌కాల‌పై ఊహాగానాలు వెలువ‌డ్డాయి. బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు ఈ ప‌ర్య‌ట‌న ద్వారా చంద్ర‌బాబు మ‌రోసారి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయినా కూడా బాబుకు హ‌స్తిన వేదిక‌గా  చేదు అనుభ‌వ‌మే ఎదురైంది.

ఢిల్లీలో గత్తర లేపుతానంటూ వెళ్లిన చంద్రబాబు నాయుడుకి భారీ షాక్‌ తగిలింది. చంద్రబాబు ఢిల్లీ టూర్‌ అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యింది. టీడీపీ అధ్యక్షుడిని కేంద్ర పెద్దలు, జాతీయ మీడియా పట్టించుకోలేదని సమాచారం. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప‌డిగాపులు కాస్తున్నప్పటికి చంద్రబాబుకు చుక్కెదురైనట్లు తెలిసింది. కశ్మీర్‌ ప‌ర్య‌ట‌న ముగించుకుని అమిత్‌ షా ఢిల్లీకి వ‌చ్చినప్పటికి, చంద్ర‌బాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదట. పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మార‌డంతో బీజేపీ అండకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు చంద్రబాబు. కానీ గతంలో అమిత్‌ షా కుటుంబంతో తిరుమలకు వస్తే,ఆయన కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించడాన్ని కూడా కాషాయ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రెండున్న‌రేళ్ల‌యినా చంద్ర‌బాబు కుట్ర‌ను బీజేపీ పెద్దలు మర్చిపోలేదు.

ఇటు కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్‌ దొర‌క్క‌, అటు జాతీయ మీడియా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఆర్టిక‌ల్ 356 అంటూ హ‌డావిడి చేద్దామ‌నుకున్న చంద్ర‌బాబు వ్యూహం తుస్సుమనడమే కాక జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిష్ట ఎంతలా దిగజారిందో మరోసారి బహిర్గతం అయ్యింది. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అమిత్ షా తో ఫోన్ లో మాట్లాడాన‌ని, వెంట‌నే స్పందించిన ఆయ‌న రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారంటూ చెప్పిన బాబుకు ఇప్పుడు ఆయ‌న అపాయింట్ మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఆశ్చ‌ర్యంగానే మారింది. బీజేపీ పెద్ద‌లు బాబుతో క‌లిసేందుకు సుముఖంగా లేర‌ని ఈ ఎపిసోడ్ తో మ‌రోసారి తేట‌తెల్ల‌మైంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : Chandrababu Delhi Tour -చంద్రబాబు కష్టాలు రెట్టింపు చేసిన హస్తిన యాత్ర

Show comments