Idream media
Idream media
ప్రకాశం జిల్లా వైసీపీ నేత, దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో జిల్లా కేంద్రమైన ఒంగోలులో చికిత్స పొందుతున్న పిచ్చిరెడ్డి.. ఈ రోజు (గురువారం) తుది శ్వాస విడిచారు. పిచ్చిరెడ్డి 1989, 1999లలో రెండుసార్లు దర్శి ఎమ్మెల్యేగా పని చేశారు.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం (ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గంలో ఉంది) పేరారెడ్డి పల్లికి చెందిన సానిరొమ్ము పిచ్చిరెడ్డి వృత్తి రీత్యా వైద్యులు. ఆయన సతీమణి పద్మావతమ్మ కూడా వైద్యురాలే. వైద్య విద్యని పూర్తి చేసిన పిచ్చిరెడ్డి.. సొంత మండలం పొదిలిలో ప్రాక్టీసు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయారంగ్రేటం చేసిన పిచ్చిరెడ్డి.. పొదిలి ఎంపీపీగా తన ప్రజా జీవితాన్ని మొదలుపెట్టారు.
తొలిసారి 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున దర్శి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారపుశెట్టి శ్రీరాములు చేతిలో 278 ఓట్ల స్వల్ప తేడాతో పిచ్చిరెడ్డి ఓడిపోయారు. 1989లో రెండోసారి పోటీ చేసిన పిచ్చిరెడ్డి.. ఈ సారి విజయం అందుకున్నారు. 1994లో ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ లభించలేదు. 1999లో మూడోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పిచ్చిరెడ్డి.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2004లో కాంగ్రెస్ టిక్కెట్ కోసం బూచేపల్లి సుబ్బారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నా.. వైవీ సుబ్బారెడ్డితో ఉన్న బంధుత్వం వల్ల పిచ్చిరెడ్డికే కాంగ్రెస్ టిక్కెట్ లభించింది. అయితే ఈ ఎన్నికల్లో బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు రెండు, కాంగ్రెస్ అభ్యర్థి పిచ్చిరెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగారు.
Also Read : Manmohan Singh-AIIMS-ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్.. జ్వరమే అంటున్న కాంగ్రెస్.. కానీ?
వైసీపీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సానికొమ్ము పిచ్చిరెడ్డి స్వయానా బాబాయి అవుతారు. వైవీ సుబ్బారెడ్డి తల్లి, పిచ్చిరెడ్డి సతీమణి పద్మావతమ్మలు అక్కాచెల్లెళ్లు. పిచ్చిరెడ్డి మరణవార్త తెలియడంతో సుబ్బారెడ్డి తిరుపతి నుంచి బయలుదేరారు. రేపు శుక్రవారం జరగబోయే పిచ్చిరెడ్డి అంత్యక్రియల్లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొనబోతున్నారు.