Idream media
Idream media
సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే(63) మరణాన్ని ఆ పార్టీ ధృవీకరించింది. కిడ్నీలు విఫలం కావడం వల్ల ఆర్కే గురువారం (అక్టోబర్ – 14) తుది శ్వాస విడిచారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన జారీ చేశారు. పార్టీ నుంచి అయనకు వైద్యం అందించినప్పుటికీ దక్కించుకోలేకపోయిందని అభయ్ ఆ లేఖలో వివరించారు. విప్లవ శ్రేణుల మధ్యనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్న మావోయిస్టు పార్టీ.. ఆర్కే ఉద్యమం, జీవిత విశేషాలను, బయట ప్రజలకు తెలియని మరికొన్ని అంశాలను ఆ ప్రకటనలో పేర్కొంది.
కామ్రేడ్ హక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్‌కే), సాకేత్, మధు, శ్రీనివాస్.. 1958లో గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి పాఠశాల టీచర్. పోస్టు గ్రాడ్యుయేషన్ చదవిన ఆర్‌కే కొంత కాలం తండ్రితోపాటు టీచర్‌గా పని చేశారు. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై భాకపా (మాలె) (పీపుల్స్ వార్)లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1980లో గుంటూరు జిల్లా పార్టీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 1982లో పార్టీలోకి పూర్తికాలం కార్యకర్తగా వచ్చాడు. పల్నాడు ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు. ఈ క్రమంలో విప్లవోద్యమ నాయకుడిగా ఎదిగి 1986లో గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. 1992లో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణ ఉద్యమానికి నాలుగు సంవత్సరాలు నాయకత్వం వహించారు. 2000 సంవత్సరంలో ఆంధ్రరాష్ట్ర కార్యదర్శిగా, 2001లో జరిగిన పీపుల్స్‌వార్ 9వ కాంగ్రేసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
Also Read : Maoist RK – మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే ఇక లేరు..?
2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పార్టీకి మధ్యలో జరిగిన చర్చల్లో పార్టీ బృందానికి నాయకత్వం వహించారు. ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి పార్టీ బృందంతోపాటు ఆయన సమర్థవంతంగా చర్చించారు. ఈ చర్చల ద్వారా పార్టీ దృక్ఫథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి తీసుకెళ్లారు. చర్చల నుంచి వైదొలిగిన ప్రభుత్వం ఉద్యమంపై తీవ్ర నిర్భంధం ప్రయోగించి, ఆర్‌కేను హత్య చేసేందుకు యత్నించడంతో.. ఆయన్ను ఆంధ్రా ఓడిశా బార్డర్ (ఏఓబీ) ఏరియాకు బదిలీ చేసి, ఏఓబీ బాధ్యతలు అప్పగించినట్లు అభయ్ ఆ ప్రకటనలో తెలిపారు. 2014 వరకు ఆర్‌కే ఏఓబీ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ నుంచి ఏఓబీని గైడ్ చేసే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 2018లో పోలిట్‌బ్యూరో సభ్యుడుగా నియమితులయ్యారు.
ఆర్‌కేకు విప్లవోద్యమంలోనే కామ్రేడ్ శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు. కుమారుడు మున్నా (ఫృధ్వి) కూడా తండ్రి బాటలోనే పయనించారు. 2018లో జరిగిన రామగూడ ఎన్‌కౌంటర్‌లో మున్నా అమరుడయ్యారు.
‘‘ఆర్‌కే నాయకత్వంలో ప్రేరణ పొందిన కేడర్, విప్లవ ప్రజానీకం ఆయన ఆశయాలను తుది కంటా కొనసాగించి,దేశంలో ప్రజాస్వామ్య విప్లవాన్ని పరిపూర్ణం చేయడానికి మరోమారు ప్రతిజ్ఞ చేద్దాం’’ అంటూ మావోయిస్టు పార్టీ ఆర్‌కేకు ఘన నివాళి అర్పించింది.
Also Read : Maoist RK Died : ఆర్కే నిజంగా చనిపోయాడా, ఎవరు దృవీకరించాలి?