Idream media
Idream media
హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో,బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కాస్త ఆసక్తికరంగా చూసారు. బద్వేల్ ఉప ఎన్నికల విషయంలో వైసీపీ గెలుస్తుంది అనే విషయం తెలిసిన కాస్త ఇక్కడ బిజెపి పోటీలో ఉండటంతో ఆదినారాయణరెడ్డి ప్రభావంపై కాస్త చర్చ జరిగింది. ఇక హుజురాబాద్ విషయానికి వస్తే ఈటెల రాజేంద్ర వర్సెస్ సీఎం కేసీఆర్ గా ఇక్కడ రాజకీయం నడిచింది. హుజురాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలు చాలా సీరియస్ గా దృష్టి పెట్టి ప్రచారం నిర్వహించారు.
అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం మాత్రం పెద్దగా లేదనే విషయం ముందు నుంచి అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ప్రచారం చేసినా సరే ఆ పార్టీ ప్రభావం కనపడలేదు. దాదాపుగా నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 680..కనీసం వెయ్యి ఓట్లు కూడా రాకపోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కు కనీసం వెయ్యి ఓట్లు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో రేవంత్ రెడ్డి సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోటీలో అసలు కాంగ్రెస్ ఉందా లేదా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి… బీజేపీ మీద అలాగే టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో దిగి ప్రచారం చేయడం వంటివి గట్టిగా చేసినా, అభ్యర్థిని ప్రకటించే విషయంలో జరిగిన జాప్యం,అలాగే బలమైన అభ్యర్థి దొరకకపోవడం ప్రధాన మైనస్ గా మారింది. అయితే ఇక్కడ మరో విషయం ప్రధానంగా ప్రస్తావించ వచ్చు.
బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హుజరాబాద్ అభ్యర్థి తో పోలిస్తే మెరుగైన ఓట్లు సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారింది. కానీ బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మ 6223 ఓట్లు సాధించారు.కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు అక్కడ ఎవరూ ప్రచారం చేయకపోయినా కమలమ్మ భుజానికి ఎత్తుకునీ ప్రచారం చేసుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆమెకు పూర్తిస్థాయిలో సహకరించకపోయినా సరే ఇక్కడ కాస్తో కూస్తో ప్రభావం చూపించారు.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయిపోయింది అని ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ని కాపాడే వారు తెలంగాణలో ఎవరు లేరు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా చెప్పుకునే వారు కూడా హుజురాబాద్ లో ప్రభావం చూపించలేక పోవడంతో… ఆ పార్టీ పునరాలోచనలో పడింది. హుజరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే స్వతంత్ర అభ్యర్థి శ్రీకాంత్ ఎక్కువ ప్రభావం చూపించారు.