CM YS Jagan – మిగిలిన రెండున్నరేళ్లు.. జగన్‌ లక్ష్యాలు ఇవే..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ సమయంలో సీఎం జగన్‌ తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారు. కరోనా వైరస్‌ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా బ్యాంకర్ల సహకారంతో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి.. పేద, మధ్య తరగతి ప్రజలు కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చేశారు. పథకాల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేయడం వల్ల.. ఆ మొత్తం తిరిగి మార్కెట్‌లోకి రావడంతో ఆర్థిక రంగం కూడా వెంటనే కోలుకుంది.

ఈ రోజు మరోసారి సీఎం జగన్‌ స్టేట్‌లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే రెండేళ్లలో తన ప్రభుత్వం ఏఏ అంశాలపై దృష్టి పెట్టబోతోందో వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాల్లో ఆర్థికాభివృద్ధి మెరుగ్గా ఉందన్న జగన్‌.. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండబోదని అంచనా వేశారు. రాబోయే రెండున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్య రంగాలపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను మంజూరు చేశామని, వాటిలో మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దీని వల్ల సిమెంట్, స్టీల్‌ సహా గృహనిర్మాణానికి సంబంధించిన అన్ని రంగాలకు మేలు జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పెరుగుతుందన్నారు.

విద్య, వైద్య రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జగన్‌ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్య కాలేజీలు ఉన్నాయని, నూతనంగా మరో 16 కాలేజీలను నిర్మించేందుకు నిర్ణయించామని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక వైద్య కాలేజీ ఉండబోతోందన్నారు.

వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా 45–60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని, తద్వారా వారు ఆర్థికంగా మరో మెట్టు ఎదుగుతున్నారని చెప్పారు. 75 వేల రూపాయలను నాలుగేళ్లపాటు ఇస్తామని, ఎవరికి ఇస్తున్నాం..? వారు ఆ నగదును దేనికి ఖర్చు పెడుతున్నారనే పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. అమూల్, ఐటీసీ, హిందుస్తాన్‌ యూనిలీవర్, పీఅండ్‌జీ వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చి.. వారిని వ్యాపారంలో రాణించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొంది వ్యాపారం చేస్తున్న మహిళలు ప్రస్తుతం నెలకు 7 నుంచి 14 వేల రూపాయల ఆదాయం ప్రతి నెలా ఆర్జిస్తున్నారని వివరించారు. ఇప్పటికి 50 శాతం కార్యక్రమాలు పూర్తయ్యాయని, మిగతా సగం ఉందన్న జగన్‌.. ఇప్పటిలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని బ్యాంకర్లను కోరారు.

Also Read : Ap Govt .Kurnool Waqf Board – జగన్ సర్కారు కీలక నిర్ణయం, కర్నూలులో మరో రాష్ట్రస్థాయి కార్యాలయం

Show comments