CM Jagan, PRC – ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీపికబురు చెప్పారు. కొన్ని నెలలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్‌సీ పై సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పీఆర్‌సీ సిద్ధమైందని, మరో పది రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను.. తిరుపతిలో ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన జగన్‌.. పీఆర్‌సీకి సంబంధించిన ప్రకటన చేశారు.

11వ పీఆర్‌సీని అమలు చేయాలని కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దసరాకు పీఆర్‌సీ ని ఆశించాయి. అయితే పీఆర్‌సీ నివేదికపై మరింత అధ్యయనం చేయాల్సి రావడంతో అమలు వాయిదా పడుతూ వస్తోంది. పీఆర్‌సీ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ.. అధ్యయనం పూర్తి చేసినట్లు తాజాగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటన ద్వారా తెలుస్తోంది.

పీఆర్‌సీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. ఇప్పటికే ఉద్యోగ సంఘాల జేఏసీ ఉద్యమం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కార్యచరణను ప్రకటించింది. అయితే ఈ లోపే సీఎం జగన్‌.. తమ డిమాండ్‌ను పరిష్కరించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సీఎం జగన్‌ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. నగరంలోని కృష్ణానగర్‌లో ఇంటింటికి వెళ్లి.. వరద బాధితులను పలకరిస్తున్నారు. వారు చెబుతున్న సమస్యలను సావధానంగా ఆలకిస్తున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్‌ భరోసా ఇస్తున్నారు. కృష్ణానగర్‌లోనే సీఎం జగన్‌ దాదాపు రెండు గంటలకు పైగా పర్యటించారు. ఈ రోజు నెల్లూరు జిల్లా పెన్నా పరివాహక ప్రాంతంలోనూ సీఎం జగన్‌ పర్యటించనున్నారు.

Also Read : CM Jagan, Flood Victims – వరద బాధితులకు భరోసా.. ఊరటనిచ్చిన సీఎం జగన్‌ హామీలు

Show comments