CM Jagan, Flood Victims – వరద బాధితులకు భరోసా.. ఊరటనిచ్చిన సీఎం జగన్‌ హామీలు

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. బాధితులకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే చేసిన సహాయానికి అదనంగా కొత్తగా మరికొన్ని హామీలను సీఎం జగన్‌ ఇచ్చారు.

వరదల కారణంగా  మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందించిన జగన్‌ సర్కార్‌.. తాజాగా మృతుల కుటుంబాల్లో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయిన వారికి కొత్త ఇళ్లు మూడు లేదా ఐదు సెంట్లలో కట్టించి ఇస్తామని చెప్పారు. పొదుపు సంఘాల వారికి ఏడాది పాటున వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు హెక్టారుకు 12 వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఎవరికైనా పరిహారం అందకపోయినా, ఇతర ఏ సమస్యలు ఉన్నా గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని, పరిశీలించి వారికి కూడా న్యాయం చేస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు. జగన్‌ ఇచ్చిన హామీలు, కలిగించిన భరోసాతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఊరట కలిగింది.

వైఎస్సార్‌ కడప జిల్లా, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సీఎం జగన్‌.. వైఎస్సార్‌ కడప జిల్లాలోని రాజంపేటలో పర్యటించారు. పింఛా, అన్నమయ్య డ్యాంలు తెగడం వల్ల రాజంపేట మండలంలో ఆరు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజంపేట మండలంలోని వరద బాధితులు, మహిళలు, రైతులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడారు. వారి బాధలు, కష్టాలు ఆలకించారు. అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించారు.

Also Read : NITI Aayog, Village Secretariat RBK – ఆర్బీకేలకు నీతి ఆయోగ్‌ ప్రశంసలు

పింఛా, అన్నయమ్య ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ చేసి, మళ్లీ పటిష్టంగా నిర్మిస్తామని రాజంపేటలోని నవోదయ పాఠశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన వరద కన్నా రెట్టింపు వరద వచ్చినా.. సమస్యలేకుండా ఉండేలా డిజైన్‌ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టుల పరిమితికి మించి, ఊహించని విధంగా వరద రావడంతో రెండు ప్రాజెక్టులు తెగిపోయాయని సీఎం జగన్‌ గుర్తు చేశారు. భవిష్యత్‌లో వరదల వల్ల గ్రామాలకు నష్టం లేకుండా.. అన్నమయ్య ప్రాజెక్టు నుంచి నందలూరు బ్రిడ్జి వరకూ రక్షణ గోడ నిర్మిస్తామని చెప్పారు.

అధికారులు అద్భుతంగా పని చేశారని సీఎం జగన్‌ కొనియాడారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణ నష్టం తగ్గిందన్నారు. సహాయ, పునరావాస పనులు వేగంగా చేశారని కితాబిచ్చారు. అధికారులంతా మమేకమై హడావుడి లేకుండా అందరికీ మంచి చేశారని, మునుపెన్నడూ లేనటువంటి విధంగా పది రోజుల్లోనే బాధితులకు సహాయం అందించారని అభినందించారు.

వైఎస్సార్‌ కడప జిల్లా పర్యటన ముగిసిన తర్వాత సీఎం జగన్‌ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రేపు శుక్రవారం చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం పర్యటించనున్నారు. దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Also Read : Water Leakage, Mopadu Reservoir – మోపాడు రిజర్వాయర్‌కు గండి.. 1996 పరిస్థితిని తలుచుకుని ప్రజల ఆందోళన..

Show comments