Jagan, Chandrababu – ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా..? ఇకపై సీఎం జగన్‌..

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అనే సినిమా డైలాగ్‌ మాదిరిగా.. ఏపీలో రాజకీయాలు మారబోతున్నాయా..? ఇకపై ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసే విమర్శలను నేరుగా సీఎం వైఎస్‌ జగనే తిప్పికొట్టబోతున్నారా..? అంటే ఏపీ రాజకీయాలను గమనించే వారి నుంచి అవుననే సమాధానం వస్తోంది. నిన్న మొన్నటి వరకు.. రెండున్నరేళ్లుగా టీడీపీ నేతలు, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వం పాలన, నిర్ణయాలపై విమర్శలు చేసినా, తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడినా.. సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఉన్న జగన్‌.. తన పని తాను చేసుకుపోయేవారు.

అయితే తాజాగా పరిస్థితి మారింది. టీడీపీ నేతల విమర్శలు, అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాలను ఉపేక్షిస్తే.. చేసే మంచి మరుగునపడి, వారు చేసే దుష్ప్రచారమే పైచేయి సాధించే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయాన్ని గమనించి సీఎం జగన్‌ తన రూటును మార్చారు. ప్రతిపక్షం చేసే విమర్శలపై నేరుగా స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పాలనతో తన పాలనను పోల్చుతూ.. విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. తనను దూషించిన విషయంపైనా జగన్‌.. నేరుగా స్పందిస్తున్నారు.

తాజాగా వైఎస్సార్‌ కడప, చిత్తూరు, అనంతపురం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సహాయం అందించింది. బాధితులను వెంటనే ఆదుకోవడంలోనూ, నష్ట పరిహారం అందిచడంలోనూ జెట్‌ స్పీడ్‌తో స్పందించింది. వరదల వల్ల ఆరు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే ప్రాథమిక నివేదికన సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఆరు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే.. ప్రభుత్వం 35 కోట్ల రూపాయలనే ఇచ్చిందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.

ఈ రోజు నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జగన్‌.. వరద నష్టం సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అందుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. ప్రతిపక్ష పార్టీ అధినేత చేస్తున్న విమర్శలపై కూడా జగన్‌ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు పేరును ప్రస్తావించకుండా.. ఆ పెద్ద మనిషి వరదపై బురద రాజకీయాలు చేస్తున్నారంటూ చురకలు అంటించారు. ఆరు వేల కోట్ల నష్టంలో.. 40 శాతం రోడ్డు, 30 శాతం పంటలు, 18 శాతం ప్రాజెక్టులకు జరిగిన నష్టం ఉందన్నారు. హుద్‌హుద్‌ తుఫాను సమయంలో 22 వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిన పెద్దమనిషి.. బాధితులకు 550 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని, అదీ కూడా కేంద్రం పంపించిన నగదని సీఎం జగన్‌.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.

గతంలో బాధితులకు పరిహారం అందేందుకు నెల రోజుల సమయం పట్టేదని, ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే పరిహారం అందిస్తున్నామని తెలిపారు. గతంలో కేవలం నిత్యావసరాలు ఇస్తే చాలు అనుకునేవారని, కానీ ఇప్పుడు నిత్యావసరాలతోపాటు ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయల నగదును కూడా అందిస్తున్నామని సీఎం జగన్‌.. తన ప్రభుత్వం చేస్తున్న పనిని వివరించారు. ఈ తరహాలో మాట్లాడిన సీఎం జగన్‌.. ఇకపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శలకు ధీటుగా బదులిస్తాననే సందేశం పంపారు.

Show comments