Idream media
Idream media
గుండెపోటుతో ఈ రోజు ఉదయం హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్‌మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలియగానే.. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న సీఎం జగన్.. హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లిహిల్స్‌లోని గౌతమ్ రెడ్డి నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పారు.
విషయం తెలిసిన వెంటనే.. హైదరాబాద్‌లో ఉంటున్న వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, వైఎస్సార్‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ నుంచి గౌతమ్ రెడ్డి భౌతికకాయంతో ఆయన ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కాగా, మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు ఉదయం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ పల్లికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం రేపు స్వగ్రామంలో ఉంచనున్నారు. అమెరికాలో ఉంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రేపు ఉదయానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.