Idream media
Idream media
భారీ వర్షాలు, అనంతరం పోటెత్తిన వరదతో రాయసీమ అతలాకుతలం అవుతోంది. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో వరద భీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల నీరు ప్రాజెక్టులు, చెరువుల్లో చేరడంతో సీమలోని పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పింఛా ప్రాజెక్టు తెగి వరద నీరు పోటెత్తడంతో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కూడా తెగిపోయింది. దీంతో ప్రాజెక్టు పరివాహక ప్రాంత గ్రామాలను వరద పోటెత్తింది. వరద తీవ్రతకు పలువురు గల్లంతయ్యారు. చెయ్యేరు నదిలో 30 మంది భక్తులు కొట్టుకుపోయారు. అందులో ముగ్గురు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. నందలూరు వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. వాగులు, వంకలు పొంగడం, పలు బ్రిడ్జిలు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద నీరు అంతా.. పెన్నా నదీలోకి చేరుకుంటుండడంతో.. సోమశిల ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు భయం గుపెట్లో ఉన్నారు.
తాజాగా పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లా కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్.. వరద పరిస్థితి, ప్రజల రక్షణ, సహాయక చర్యలపై స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రాంత ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమశిల ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
దురధృష్టవశాత్తూ ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం వీలైనంత త్వరగా అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వరద ప్రభావానికి గురైన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు.పంట, ఆస్తి నష్టాన్ని వీలైనంత త్వరగా లెక్కించాలని, ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. పంట వేసుకునేందుకు వెంటనే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గిన వెంటనే చెరువులకు పడిన గండ్లును పూడ్చాలని ఆదేశించారు.
వరద తగ్గిన తర్వాత అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలని తెలిపారు. వరద తగ్గేవరకు తిరుమలలోని భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమల, తిరుపతిలో పారిశుధ్య పనులను చేపట్టాలని సూచించారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీమలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపిస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు జిల్లాల మంత్రులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
Also Read : Annamayya Project -తెగిన అన్నమయ్య డ్యామ్ ,భయం గుప్పెట్లో సోమశిల ప్రాజెక్ట్