Chandrababu Naidu – అసెంబ్లీలో అవమానం ఘట్టాన్ని చివరి బొట్టు వరకూ పిండుతున్న చంద్రబాబు

మునిగిపోతున్న వ్యక్తి చేతికి చిన్న ఆధారం దొరికినా దాన్ని లైఫ్ జాకెట్ లాగా మార్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది అని చెప్తూ తన పార్టీ వర్గాల్లో ఉత్సాహం రేకెత్తించాలని ఆయన చెప్తూ వచ్చిన మాటల్లో ఏమాత్రం పసలేదని మొన్న జరిగిన ఎన్నికల్లో కుప్పంతో సహా ఎదురైన అపజయాలు నిరూపించాయి. ఏం చేసి స్వంత కేడర్లో పోరాటం చేసే ఆసక్తి నింపాలో అర్థం కాక, దిక్కుతోచని పరిస్థితిలో, అసెంబ్లీలో తన సతీమణికి జరిగిన అవమానం బాగా అంది వచ్చింది ఆయనకు. “మీ సతీమణిని ఇక్కడ ఎవరూ అవమానించలేదు. ఆమె పేరు కూడా ఎవరూ ఎత్తలేదు. అలా కాదని నిరూపిస్తే ఆవిడ కాళ్ళమీద పడి క్షమించమని అడుగుతాం” అన్న అధికారపార్టీ ఎమ్మెల్యేల మాటలు ఏమాత్రం పట్టింకోకుండా, మీడియా మందుకు వచ్చి రోదించాడు చంద్రబాబు.

అయితే తన ఏడుపు ప్రజల్లోనే కాకుండా స్వంత పార్టీ శ్రేణుల్లో కూడా ఊహించినంత కదలిక తెప్పించలేదని గమనించిన కొందరు నాయకులు” మన నాయకుడికి, ఆయన సతీమణికీ జరిగిన అవమానానికి మనస్థాపంతో ఎవరూ ఆత్మహత్యా ప్రయత్నం చేయవద్దు” అని పరోక్షంగా హింట్ ఇచ్చినా ఎవరూ ఆ పని చేయకపోవడంతో, ఎవరో ఎక్కడో చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నాలను చంద్రబాబు సతీమణికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక చేసినట్టు చూపించే ప్రయత్నం చేసినా ఆ ఘటనలోని వ్యక్తుల బంధువులు మీడియా ముందు అసెంబ్లీ అవమానం ఘట్టానికి, ఆత్మహత్యా ప్రయత్నాలకు సంబంధం లేదని చెప్పారు.

నందమూరి కుటుంబం నుంచి నిరసన

స్వర్గీయ ఎన్టీ రామారావు వల్ల ప్రాంతాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రమంటతా అభిమానులు ఉన్న నందమూరి కుటుంబాన్ని రంగంలోకి దించి సానుభూతి పవనాలు వీచేలా చేసిన ప్రయత్నం కూడా ఏమాత్రం ఫలితాలనివ్వలేదు. హీరో బాలకృష్ణతో సహా రెండు తరాల నందమూరి కుటుంబీకులు వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఆశించిన ప్రభావం చూపకపోగా, నందమూరి ఆడపడుచుల పేర్లు చెప్పి, “మా ఆడవారు ఎవరితోనూ తిరగరు. మందు తాగి ఎక్కడంటే అక్కడ పడిపోరు” అని ఒకరూ, 2019 ఎన్నికల ముందు, “నేను వేసిన రోడ్లు, నేను కట్టిన టాయిలెట్లూ” అని చెప్పిన చంద్రబాబు శైలిలో, “చంద్రబాబు కట్టిన అసెంబ్లీలో కూర్చుని ఆయన సతీమణిని అవమానిస్తారా” అని మరొకరు అనడంతో ప్రత్యర్థిని వణికించవలసిన హెచ్చరికలు నవ్వు పుట్టించాయి.

Also Read : Chandrababu Naidu – ఆ మాట‌ల వెనుక ల‌క్ష్య‌మేంటో?

నిరాశపరచిన జూనియర్

సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో పాటు ఆయన ఆంగికం, వాచకం కూడా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఒకరోజు ఆలస్యంగా విడుదల చేసిన వీడియో సందేశం తెలుగుదేశం పార్టీ శ్రేణులను పూర్తిగా నిరాశపరిచింది. “మా అత్తను అవమానిస్తారా? అమ్మతోడు అలా అవమానించిన వారిని అడ్డంగా నరికేస్తా” అని కత్తి అందుకున్నంత పని చేస్తాడేమోనని ఆశిస్తే, ఆర్టీసీ బస్సుల్లో “ఆడవారిని గౌరవిద్థాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం” అని రాసినట్టు, “యత్రనార్యస్తు పూజ్యంతే” అని ప్రవచనం చెప్పడం తెలుగుదేశం శ్రేణులు హర్షించలేకపోయారు. ఈ విషయం తన సతీమణితో కలిసి పన్నెండు గంటల దీక్షకు కూర్చునే ముందు ఆ పార్టీ నాయకుడు వర్ల రామయ్య చెప్పాడు.” ఈ సమయంలో హరికృష్ణ ఉంటే తన సోదరిని అవమానించిన వారి మీదికి నేరుగా యుద్ధానికి పోయి ఉండేవాడు” అని అన్నాడు వర్ల రామయ్య.

తుఫాను ప్రాంతాల్లో కూడా

మొన్న తుఫాను ధాటికి కకావికలమైన నెల్లూరు, కడప, చిత్తూరు , అనంతపురం జిల్లాల్లో కూడా ప్రతిచోటా తన సతీమణికి అసెంబ్లీలో అవమానం జరిగిపోయిందని సానుభూతి పొందే ప్రయత్నం చేశాడు చంద్రబాబు. తుఫాను దెబ్బకు అన్నీ కోల్పోయి ఉన్న ప్రజలు తన సతీమణికి జరిగిన అవమానం గురించి పెద్దగా పట్టించుకోక పోవడంతో, ఆ విషయం మరుగునపడకుండా ఉండడానికి ఈసారి నేరుగా తన భార్యను రంగంలో దించాడు చంద్రబాబు. ఆమె మీడియా ముందుకో, ప్రజల ముందుకో రాకుండా, ఎన్టీఆర్ ట్రస్ట్ లెటర్ ప్యాడ్ మీద తనకు అవమానం జరిగిందని తెలిసి అండగా నిలబడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ తల్లిదండ్రులు తమని విలువలతో పెంచిన విషయం గుర్తు చేసుకున్నారు భువనేశ్వరి గారు.

Also Read : Chandrababu – రెండున్నరేళ్లు సానుభూతి నిలుస్తుందా ?

తదుపరి కార్యాచరణ ఏమిటి?

మీడియా కెమెరాల ముందు చంద్రబాబు వెక్కివెక్కి ఏడిస్తే వీచని సానుభూతి పవనాలు భువనేశ్వరి రాసిన బహిరంగ లేఖతో రావని చంద్రబాబుకు బాగా తెలుసు. ముందు అసెంబ్లీలో జరిగిన ఘట్టం వీడియో క్లిప్స్ డబ్బింగ్ చేయించి, ఢిల్లీలో జాతీయ మీడియా ముందు ప్రదర్శించాలని భావించినా అది ఎందుకో జరగలేదు. తుఫాను ప్రాంతాల పర్యటన అనంతరం వెళ్తారేమో తెలియదు. లేదంటే ప్రత్యర్ధులు తాను అసెంబ్లీలో “స్వంత పెళ్ళాన్ని చూసుకోలేని వాడు దేశాన్ని చూసుకోగలడా” అని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్న వీడియోని, తన బావమరిది, తన పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజయవాడలో నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతూ “మాకీ ఛూస్” అని మోడీ మీద ప్రేలిన వీడియోని బయటకు తీసి, డబ్బింగ్ చేసి వదులుతారని భయపడి ఆ ఆలోచన విరమించుకున్నారేమో తెలియదు.

ఇప్పుడు ఈ అంశాన్ని మరింత విస్తృతంగా జనాల్లోకి తీసుకుపోవడానికి డిసెంబర్ ఒకటి నుంచి ప్రతి పట్టణంలో, గ్రామంలో ఆత్మగౌరవ సభలు పెట్టి తమ అధినేత సతీమణికి జరిగిన అవమానాన్ని అందరికీ వివరించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం చేశారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా చేస్తున్నది సానుభూతి కోసం, దాని వల్ల వచ్చే ఓట్లకోసం అన్నది సుస్పష్టం. ఊరూరా పెట్టే సభల వల్ల సానుభూతి పవనాలు ఉవ్వెత్తున వీస్తాయా అంటే అనుమానమే. అవి ఓట్ల రూపంలో మారి అధికారం అందిస్తాయా అన్నది మరింత సందేహాస్పదం. అయితే ప్రతి ఊరిలో, ప్రతి సభలో మా నాయకుడి సతీమణికి అవమానం జరిగిందని స్వంత పార్టీ శ్రేణులే ప్రచారం చేయాలి. ఇంత జరుగుతూ ఉంటే అధికార పార్టీ ఊరికే చేతులు ముడుచుకొని కూర్చోదు కదా. మేము అవమానకరంగా ఏమీ మాట్లాడలేదు. అలా ఉంటే ఆధారాలు చూపించండి అని వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతారు. ఆధారాలు చూపించకపోతే ఏమీ లేకుండా ఓట్లకోసం స్వంత భార్యని అల్లరి చేస్తున్నాడు చంద్రబాబు అని రివర్స్ ప్రచారం మొదలు పెడతారు అధికార పక్షం వారు.

ఇంత చేసి, అసెంబ్లీ ఎన్నికలు రెండు సంవత్సరాల తర్వాతే వస్తాయి. అప్పటివరకూ ఈ అంశాన్ని తాజాగా ఉంచడం సాధ్యమా అని కూడా చూడాలి. ప్రజల మనసుల్లో నుంచి ఈ విషయం కనుమరుగు అవుతుందని అనిపించినప్పుడు భువనేశ్వరి గారు మీడియా ముందు కన్నీరు పెడితే మరి కొంతకాలం వార్తల్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఎవరో ఒకరితో మీడియాలో ఈ మంట రాజేస్తూ ఉండాలి. ఎంత పెద్ద సంచలనం అయినా మరో సంచలనం వచ్చే వరకే ప్రజల మనసుల్లో ఉండి, ఆ తర్వాత కనుమరుగయ్యే ఈ రోజుల్లో ఇలాంటి చిన్న విషయాన్ని పట్టుకుని చంద్రబాబు ఎన్నికల గోదావరి దాటాలనుకుంటారా అన్నది చూడాలి.

Also Read : Mahilala Athma Gouravam Sabha, Chandrababu – ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు.. బాబు నిస్సహాయతకు నిదర్శనం

Show comments