Cryptocurrency – క్రిప్టో కరెన్సీ… సీరియస్ గా కేంద్రం, ఏం చేయబోతుంది…?

మన దేశంలో క్రిప్టోకరెన్సీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సమస్యగా మారింది. దీనికి సంబంధించి మోసాలు ఎక్కువగా జరగడంతో నిఘా వర్గాలు కూడా అలెర్ట్ అయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఈ కరెన్సీ పేరుతో భారత్ లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ క్రైం అధికారులు. ఇక క్రిప్టోకరెన్సీపై బిల్లును సిద్ధం చేసిన కేంద్రం… కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది.

ది క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021 పేరుతో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎజెండాలో బిల్లును కేంద్ర ప్రభుత్వం చేర్చినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఆధ్వర్యంలో సొంత డిజిటల్ కరెన్సీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది కేంద్రం. అదే సమయంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీని కొన్ని మినహాయింపులతో బ్యాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలో నల్లధనం భారీగా దాచిపెట్టే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎల్‌సాల్వడార్ దేశం మాత్రమే క్రిప్టోకరెన్సీని అధికారికంగా ఆమోదించింది.

ఇక బిట్‌కాయిన్ ధర గత ఏడాదిలో దాదాపుగా రెట్టింపు అయింది అని రిజర్వ్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 60వేల డాలర్లకు చేరుకుంది బిట్‌కాయిన్. భారత్ నుంచి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నట్టు అంచనా వేస్తుంది కేంద్రం. వీరంతా కలిసి దాదాపు రూ. 40వేల కోట్లు క్రిప్టోలో పెట్టుబడి పెట్టినట్టు అంచనా వేస్తున్నాయి. గత వారం క్రిప్టోకరెన్సీ వ్యవహారంపై చర్చించిన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ… పలు అభిప్రాయాలను సేకరించింది. ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, దీనికి సంబంధించి నేరాలను ఎలా అరికట్టాలనే దానిపై పలు అభిప్రాయాలను సేకరించారు.

క్రిప్టో ఎక్సేంజులు, బ్లాక్‌చైన్ అండ్ క్రిప్టో అసెట్స్ కౌన్సిల్ సహా పలువురు క్రిప్టో కరెన్సీ రంగ నిపుణులను స్టాండింగ్ కమిటీ కలిసి కొన్ని అభిప్రాయాలు చెప్పింది. నేరాలు పెరుగుతున్న నేేపథ్యంలో కఠిన చట్టాన్ని తీసుకొచ్చే అంశంపై నిపుణులతో మాట్లాడారని తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా బ్యాన్ చేయడం కంటే నియంత్రించడం మేలనే అభిప్రాయానికి స్టాండింగ్ కమిటీ వచ్చింది. సిడ్నీ డైలాగ్ సందర్భంగా ఈ అంశంపై మాట్లాడిన ప్రధాని పలు ఆందోళనకర అంశాలను లేవనెత్తారు. భవిష్యత్తులో చోటు చేసుకునే సమస్యల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని ప్రపంచ దేశాలకు ప్రధాని పిలుపునిచ్చారు.

Also Read : Central Government- కేంద్రంపై ఎన్నికల ఒత్తిడి -ముడి చమురు అత్యవసర నిల్వల వెలికితీత

Show comments