Centrla government ,compensation to farmer’s – రైతు కుటుంబాల‌కు త్వ‌ర‌లోనే ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌..?

నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఇప్పుడు మ‌రో నిర్ణ‌యం తీసుకోక త‌ప్పేలా లేదు. చ‌ట్టాల ర‌ద్దు స‌రే.. ఉద్య‌మం కోసం ప్రాణాల‌ర్పించిన రైతు కుటుంబాల‌ను ఎలా ఆదుకుంటారో చెప్పాల‌నే డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌తీ రైతు కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తే.. క‌నీసం రూ. కోటి అయినా ప‌రిహారం ఇవ్వాల‌ని సొంత పార్టీ ఎంపీయే మోదీకి లేఖ రాయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త‌గా కేంద్రం రూపొందించిన చ‌ట్టాల ర‌ద్దుకు చ‌లిలో, వాన‌లో, ఎండ‌లో దాదాపు ఏడాది కాలం పాటు రైతులు ఉద్య‌మించారు. ఈ ఉద్య‌మంలో సుమారు ఏడొంద‌ల మందికిపైగా ప్రాణాలొదిలారు. ఇప్పుడు చ‌ట్టాలు ర‌ద్దు కావ‌డంతో ప‌రిహారం కోసం పలువురు ప‌ట్టుబ‌డుతున్నారు.

చ‌ట్టాల ర‌ద్దు అనంత‌రం ప‌రిహారం అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైతు సంఘాల నాయ‌కులు, విప‌క్షాలు ఇప్పుడు ఆ డిమాండ్ ను తెర‌పైకి తెస్తున్నాయి. అద‌లా ఉంచితే.. న‌రేంద్ర మోదీని సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ వదలకుండా వెంటపడుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు ఆయ‌న చాలా కాలంగా ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు.లఖీంపూర్‌ ఖేరిలో ప్రశాంతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి కొడుకు వాహనం నడపటంతో నలుగురు మరణించిన విషయం దేశంలోనే సంచలమైంది. ఇలాంటి అనేక ఘటనలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై అనుమానాల కారణంగా వ్యవసాయ చట్టాలను మోడి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఇదే విషయాన్ని వరుణ్ ప్రస్తావిస్తూ మోడికి ఓ లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు ధన్యవాదాలు చెబుతునే అనేక డిమాండ్లు చేశారు.

చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్రం తలా కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించాలన్నారు. రైతులపై ఉద్యమం సందర్భంగా నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ చాలా కీలకమైంది.ఎప్పటికప్పుడు వ్యవసాయ సీజన్‌లో కేంద్రం పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తోందంతే. అందుకనే కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని ఎంపీ డిమాండ్ చేేేశారు. లఖీంపూర్‌ ఖేరీలో రైతుల మరణానికి కారణమైన కేంద్రమంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. నిజానికి కేంద్రమంత్రిని ఎప్పుడో మంత్రివర్గం నుండి మోడి తప్పించాల్సింది. ఘటన జరిగి నెలన్నర అవుతున్నా మోడి ఆ పనిచేయకపోవటంతో రైతుల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని ఎంపీ తన లేఖలో గుర్తుచేశారు.

వ‌రుణ్ లేఖ అంశం అటుంచితే.. ఏడాదిగా జరుగుతున్న రైతు ఉద్యమంలో సుమారు ఏడొంద‌ల నుంచి ఏడొంద‌ల యాభై మంది వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే వారి కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ లిస్టును ఇవ్వాల్సిందిగా రైతు సంఘాల‌ను కోరారు. పంజాబ్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఉద్య‌మంలో అరెస్టు అయిన రైతు కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు కూడా ప‌రిహారం అందించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో కేంద్రం కూడా దీనిపై ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏ ల‌క్ష్యం కోసమైతే చ‌ట్టాల ర‌ద్దును ప్ర‌క‌టించారో అది పూర్తిగా నెర‌వేరాలంటే ప‌రిహారం కూడా ప్ర‌క‌టించాల‌నే చ‌ర్చ‌లు కేంద్ర పెద్ద‌లు లేవ‌నెత్తిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి త్వ‌ర‌లో ప‌రిహారంపై కూడా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Also Read : Lakhimpur Incident – వ్యవసాయ చట్టాల రద్దు సరే.. వారి సంగతేంటి?

Show comments