Idream media
Idream media
పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కుమారుడు, అంతకుమించిన ప్రతిపక్ష హోదా, అంతకుమించిన రాజకీయ అనుభవం గల చంద్రబాబునాయుడికి తనయుడైన లోకేశ్ కేవలం ఎమ్మెల్యే అయ్యేందుకు విపరీతంగా కష్టపడుతున్నారు. ముఖ్యమంత్రులుగా చేసిన వారి కుమారులు ఏకంగా ముఖ్యమంత్రులే అవుతున్న కాలంలో.. ఎమ్మెల్యేగా నెగ్గేందుకు అపసోపాలు పడుతున్నారు లోకేశ్. నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయితే దక్కింది కానీ.. ఎమ్మెల్యేగా అతడికి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. దీంతో గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఆ ఎన్నికలై రెండున్నరేళ్లే అయింది. ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉంది. అయినప్పటికీ లోకేష్ ఇప్పటి నుంచే గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా ప్రచారాలు, పాదయాత్రలు అంటూ మంగళగిరిలో తిరుగుతున్నారు. పోయిన చోటే వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. పెద్దలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదే చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచే రిపేర్ చేసే పనిలో పడ్డారు అగ్రనేతలు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటి చేసిన లోకేష్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో ఓడిపోవడం, రాజధాని నియోజకవర్గంలో ఓడిపోవటంతో లోకేష్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓటమి తర్వాత మరింత ఎక్కువుగా లోకేష్ పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ నుండి గెలుపే ధ్యేయంగా లోకేష్ పని చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
గత నెల రోజుల పరిధిలో రెండోసారి తాడేపల్లి మండలంలో లోకేష్ అభిమానులను, నేతలను కలుస్తున్నారు. రెండు వారాల క్రితం మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో పర్యటించారు.
Also Read : బాబుకు తత్త్వం బోధపడిందా?
మరోవైపు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత మరోసారి ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ లోకేష్ పోటీ చేస్తే ఓడించేందుకు ఇప్పటి నుండే ప్రణాళిక రచిస్తోంది. మంగళగిరిలో పద్మశాలీలు (చేనేత వర్గం) సామాజిక ఓటర్లు అధికంగా ఉంటారు. మంగళగిరి నుండి ఎవరు గెలవాలన్నా వారి మద్దతు అవసరం. ఇందులో భాగంగానే చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే జగన్ ప్రభుత్వం బీసీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. అన్ని సామాజిక వర్గాలను కూడా అక్కున చేర్చుకుంటోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను అందరికీ చేరువ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో లోకేశ్ ఎంత కష్టపడ్డా ఫలితం దక్కుతుందా అంటే.. చెప్పలేమని సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఏం జరగనుందో చూడాలి మరి.