అది మార్చుకోకుంటే జ‌గ‌న్ ను ఢీ కొట్ట‌డం క‌ష్ట‌మే..!

ప్ర‌తిప‌క్షం అంటే అధికార‌ప‌క్షాన్ని తిట్ట‌డ‌మే కాదు.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తే మెచ్చుకోవాలి కూడా. అలాగే త‌మ పార్టీ నేత‌ల‌ను అరెస్టు చేశార‌నో, త‌న‌ను తిట్టార‌నో మాత్ర‌మే ఆందోళ‌న‌లు చేయ‌డం కాదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కూడా పోరాడాలి. జ‌నాల్లో తిర‌గాలి. కానీ,. ఏపీ ప్ర‌తిప‌క్షం టీడీపీ తీరు చూస్తే.. రెండున్న‌రేళ్లలో త‌మ పార్టీ నేత‌ల ప‌రామ‌ర్శ‌ల యాత్రలే ఎక్కువ కానీ.. ప్ర‌జ‌ల కోసం రోడ్డెక్కింది త‌క్కువే. పైగా ఆయా సంద‌ర్భాల్లో కూడా జ‌గ‌న్ ను తిట్ట‌డానికే ప‌రిమితం అవుతున్నారు కానీ, రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్త‌డం లేదు. పాల‌నా ప‌రంగా చూడ‌కుండా జ‌గ‌న్ తో వ్యక్తిగత వైరమే ఎక్కువగా ఉన్న‌ట్లుగా టీడీపీ తీరు క‌నిపిస్తోంది. ఆ పంథా మార్చుకోలేనంత కాలం ప్ర‌జ‌లు ఆ పార్టీని గుర్తించ‌డం క‌ష్ట‌మేన‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ జన్మలో సీఎం కాడంటూ 2014 ఎన్నికల్లో చంద్ర‌బాబు అండ్ కో ప‌దే ప‌దే ప‌లికేవారు. కానీ ఆయ‌న‌ను ఎదుర్కోవ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అవ‌స‌రం కావాల్సి వ‌చ్చింది. ఎన్ని చేసినా కూడా జనాల్లో తరగని ఆదరణ ఉన్న జగన్ 2019 ఎన్నికల్లో దిమ్మ‌తిరిగే మెజారిటీతో గెలిచారు. ఈ విష‌యాన్ని టీడీపీ నేతలు ఇప్ప‌టికీ తట్టుకోలేకపోతున్నారు. గ‌త పాల‌న‌లో చేసిన త‌ప్పుల కార‌ణంగా ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న టీడీపీ రెండేళ్ళుగా ఆ పాత్రను సక్రమంగా నిర్వహిస్తోందా అన్నదే పెద్ద చర్చగా ఉంది. టీడీపీ ఏ విషయాన్ని అయినా ప్రభుత్వాన్ని పట్టుకుని విమర్శించడమే పనిగా పెట్టుకుందని కూడా సెటైర్లు పడుతూంటాయి. ఒక్క విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకోలేదని వైసీపీ నేతలు కూడా అంటూంటారు.

నిజానికి ప్రతిపక్షం అంటే గుడ్డిగా వ్యతిరేకించడం కానే కాదు గతంలో విపక్షాలు అలా చేసేవి కావు. ఏపీలో జగన్ రెండేళ్ళలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అదే సమయంలో జగన్ సర్కార్ మంచి పనులు కూడా కొన్ని చేసి ఉంటారు కదా అన్నది కూడా ఆలోచించాలి. అలా మంచి పనులు చేసినపుడు మెచ్చుకుని చెడ్డ పనులు చేసినపుడు నిందిస్తే కచ్చితంగా తెలుగుదేశం మాటకు జనంలో విలువ పెరిగేది అని కూడా అంటారు.

ఇక జగన్ని పట్టుకుని ఫేక్ ముఖ్యమంత్రి అని అసమర్ధుడు అని అవినీతిపరుడు అంటూ విమర్శలు చేయడం వల్ల జనాల్లో టీడీపీ గ్రాఫ్ అసలు పెరగడంలేదు అంటున్నారు. జగన్ విషయంలో టీడీపీ ఒంటి కాలితో లేస్తుంది. దానికి కారణం మళ్లీ మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని భయమా. లేక జగన్ కి జనాదరణ ఉందని అక్కసా. అలాంటి ఆలోచ‌న‌లు, తీరు మార‌క‌పోతే ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా జగన్ ని ఢీ కొట్టడం కష్టమే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయంగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు ఆ విష‌యాన్ని గుర్తించ‌లేక‌పోవ‌డం విడ్డూరంగా ఉందంటున్నారు. అర్ధ‌భాగం గ‌డిచిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మిగిలిన అర్ధ భాగంలోనూనా హుందాగా న‌డుచుకుని ఎన్నిక‌ల క్షేత్రంలో ఎంత వ‌ర‌కు టీడీపీ ఆక‌ట్టుకుంటోందా చూడాలి.

Show comments