Idream media
Idream media
గౌరవ ప్రదమైన న్యాయవ్యవస్థలోకి అవినీతి పాకింది.. న్యాయమూర్తులకు లంచాలు ఇచ్చి తీర్పులను తమకు అనుకూలంగా తెచ్చుకుంటున్నారు.. అనే అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. ఆ అనుమానాలకు, విమర్శలకు బలం చేకూరేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. లంచం తీసుకుని తీర్పు చెప్పారనే ఆరోపణలపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సీబీఐ కేసు నమోదు చేసింది. సదరు న్యాయమూర్తిని విచారించేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్ శుక్లా ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి సంబంధించిన కేసులో.. సదరు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. సౌకర్యాల లేమి కారణంగా ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో విద్యార్థులు చేరకుండా కేంద్ర ప్రభుత్వం 2017లో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదరు కాలేజీ.. సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తర్వాత దాన్ని విరమించుకుని లక్నో బెంచ్‌లో దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన జిస్టిస్ శుక్లా.. సదరు ప్రైవేటు కాలేజీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
సదరు కాలేజీ యాజమాన్యం నుంచి ముడుపులు తీసుకుని జస్టిస్ శుక్లా వారికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఢిల్లీ, మీరట్, లక్నో సహా పలు ప్రాంతాలలో సోదాలు చేసిన సీబీఐ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద జస్టిస్ శుక్లాను విచారించేందుకు అనుమతివ్వాలని సీబీఐ ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్వాపరాలు విచారించి.. అనుమతి మంజూరు చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో జస్టిస్ శుక్లాతోపాటు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఐఎం ఖుద్దూసీ ప్రసాద్, ప్రైవేటు మెడికల్ కాలేజీకి చెందిన భగవాన్ ప్రసాద్ యాదవ్, పలాశ్ యాదవ్, భావనా పాండే, సుధీర్‌గిర్‌లపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఓ వ్యక్తి.. తమకు అనుకూలమైన తీర్పు పొందేందుకు గాను జస్టిస్ శుక్లాకు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. జస్టిస్ శుక్లాను సీబీఐ అధికారులు విచారించిన తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అకాశం ఉంది.
Also Read : Three Capitals, AP High Court – చట్టాల ఉపసంహరణ సమాప్తం.. ఆ ఒక్కటే మిగిలింది..