Idream media
Idream media
నూతన వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది. అలాగే అంతకుమించి కొత్త వాదనలను, డిమాండ్లను తెరపైకి తెస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి అంశాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న నరేంద్ర మోదీ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు లేదా సంస్థలనే అమ్మాలనే నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. రైతులకు క్షమాపణలు చెప్పి చట్టాలను రద్దు చేసిన మోదీ.. ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా అదే పంథా అవలంబించాలని పేర్కొంటున్నారు.
‘వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐడీబీఐ బ్యాంక్, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హన్స్, ఎయిర్ ఇండియా తదితర సంస్థల వ్యూహాత్మక విక్రయం ఉంటుంది. ఎల్‌ఐసీ ఐపీవో కోసం ప్రస్తుత చట్టాలనూ సవరిస్తాం. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా మిగతా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తాం. ఇందుకు సంబంధించి జాబితాను సిద్ధం చేయాలని ఇప్పటికే నీతి ఆయోగ్‌కు సూచించాం’ అని గతేడాది బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. చాలా సంస్థల్లో వాటాల విక్రయం ప్రారంభించారు.
నీతి ఆయోగ్ కేంద్రానికి సమర్పించిన జాబితా ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లను ప్రైవేటీకరించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. (2021-22)లో పీఎస్‌యూల నుంచి రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించాలన్న లక్ష్యం దిశగా కదులుతోంది. విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, అణు శక్తి, ఖగోళ, రక్షణ, బ్యాంకింగ్, భీమా,ఆర్థిక సేవలు, రవాణా, టెలీకమ్యూనికేషన్ల లాంటి కీలక రంగాలకు చెందిన సంస్థల నిర్వహణలో పరిమిత పాత్ర పోషించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతోపాటు రెగ్యులేటరీ (నియంత్రణ) సంస్థలు, డెవలప్‌మెంట్ ఫైనాన్సింగ్ సంస్థలను ప్రైవేటీకరణకు దూరంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం.. ఉక్కు, ఆతిథ్యం లాంటి కీలకేతర రంగాల్లోని పీఎస్‌యూలను ప్రైవేటీకరించేందుకు లేదంటే మూసివేసేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో విశాఖలోని ఉక్కు పరిశ్రమ కూడా ఉంది.
ప్రభుత్వ రంగంలోని పలు సంస్థలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని అలాగే నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెను భారమే. నాలుగు వ్యూహాత్మక రంగాలు (అణు శక్తి-ఖగోళ, రక్షణ, రవాణా-టెలీకమ్యూనికేషన్లు, విద్యుత్-పెట్రోలియం-బొగ్గు-ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్-బీమా-ఆర్థిక సేవలు) మినహా మిగిలిన అన్ని రంగాల్లోని పీఎస్‌యూలను ప్రైవేటీకరించి తీరుతాం.. అని నరేంద్ర మోదీ కూడా పేర్కొన్నారు. ఈ నిర్ణయాలపై కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మరి దీనిపై కేంద్ర నిర్ణయం మారుతుందా?
Also Read : Lakhimpur Incident – వ్యవసాయ చట్టాల రద్దు సరే.. వారి సంగతేంటి?