Idream media
Idream media
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జంకె వెంకట రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సౌమ్యుడుగా, రాజకీయ దర్పం ప్రదర్శించని నేతగా పేరొందారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. జంకె వెంకట రెడ్డి తండ్రి జంకె రామిరెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆ పదవి దక్కలేదు. తండ్రి సాధించలేనిది కొడుకు వెంకట రెడ్డి సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు.
రాజకీయాల్లో అంచెలంచెలుగా జంకె వెంకట రెడ్డి ఎదిగారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టారు. 1987లో మండల అధ్యక్ష పదవికి పోటీ చేసి గెలిచారు. 1989 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే సీపీఐతో పొత్తులో భాగంగా ఆ సీటను టీడీపీ వదులుకుంది. టీడీపీ, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే (1978) పూల సుబ్బయ్య పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందురు పెద కొండారెడ్డి (కేపీ కొండారెడ్డి) విజయం సాధించారు.
1989 ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటించిచవిచూశారుకటరెడ్డి 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించారు. ఈ సారి కూడా జంకెకు మొండిచేయి చూపారు. సీపీఐతో పొత్తులో భాగంగా.. ఆ సీటును ఎన్టీరామారావు ఈ సారి కూడా సీపీఐకి కేటాయించారు. ఈ సారి పూల సుబ్బయ్య సతీమణి తాయరమ్మకు మొదట టికెట్ దక్కినా కొందరి రాజకీయంతో ఆవిడ పోటీ నుంచి తప్పుకోవడంతో సిపిఐ కార్యదర్శి అందే నాసరయ్య పోటీచేశారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావ్ సలహాతో స్వతంత్ర అభ్యర్థిగా జంకె వెంకట రెడ్డి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కొబ్బరి చెట్టు గుర్తుతో బరిలోకి దిగిన జంకె వెంకట రెడ్డి దాదాపు 22 వేల మెజారిటీతో గెలుపొందారు. ప్రకాశం జిల్లాలో ఆ ఎన్నికల్లో జంకె వెంకటరెడ్డికి వచ్చిన మెజారిటీనే అత్యధికం కావడం విశేషం. గెలిచిన తర్వాత జంకె టీడీపీలోకి వెళ్లారు.
Also Read : YCP MLC Candidates – పాత, కొత్త కలయిక.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
1999 ఎన్నికల్లో టీడీపీ జంకె వెంకట రెడ్డికి సీటు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేపీ కొండా రెడ్డి గెలిచారు. టీడీపీలోకి వచ్చిన కొత్తతరం నేతలతో వచ్చిన విభేదాలు, మాట పట్టింపులతో జంకె వెంకటరెడ్డి రాజకీయంగా పెద్ద తప్పటడుగు వేశారు. 2001 జిల్లా పరిషత్ ఎన్నికల్లో పుల్లలచెరువు మండలం నుంచి జెడ్పీటీసీగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంట్రాక్టర్ శంకర్ రెడ్డి బరిలో నిలిచారు. నెల్లూరుకు చెందిన శంకర్ రెడ్డి స్థానికంగా కాంట్రాక్టులు చేస్తున్నారు. టీడీపీలోని జంకె వ్యతిరేకవర్గం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి పని చేయడంతో జంకె వెంకటరెడ్డి ఓడిపోయారు. ఈ పరిణామం జంకె రాజకీయ జీవితంలో పెద్ద కుదుపు.
2004 ఎన్నికల్లో టీడీపీ జంకెను పక్కనపెట్టింది. జంకె వ్యతిరేకవర్గమైన కందుల నారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ ఎమ్మెల్యే కేపీ కొండా రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ టిక్కెట్ రాకపోయినా.. పోటీ చేసేందుకు జంకె సిద్దమయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 22, 287 ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో జంకె గెలవకపోయినా.. జంకె వల్ల టీడీపీ అభ్యర్థి భారీ ఓటమిని చవి చూశారు. కాంగ్రెస్ పార్టీకి 58,108 ఓట్లు రాగా, టీడీపీకి 37,370 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read : YCP, MLC Elections, Tumati Madhava Rao – తుమాటి మాధవరావుకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా..?
ఎన్నికల అనంతరం 2005లో జంకె వెంకట రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేపీ కొండా రెడ్డి గెలుపుకు కృషి చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. సీనియర్ నాయకుడు కావడంతోపాటు మంచి వ్యక్తిగా పేరొందిన జంకె వెంకటరెడ్డికి వైఎస్ జగన్ మార్కాపురం సీటును కట్టబెట్టారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2014 ఎన్నికల్లో జంకె విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో వైసీపీ సీటు కేపీ కొండారెడ్డి కుమారుడు కుందురు నాగార్జున రెడ్డికి దక్కింది. నాగార్జున రెడ్డి విజయానికి కృషి చేసిన జంకె వెంకట రెడ్డి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుందని జంకె వెంకటరెడ్డి భావించారు. ఆ క్రమంలోనే ఆయన క్రియాశీలకంగానే ఉన్నారు. తన అనుభవానికి తగినట్లు ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు. ఆయన అనుచరులు కూడా అదే ఆశతో ఉన్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల జాబితాలో జంకె పేరు లేదు. తాజాగా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా పూర్తవబోతోంది. ఇక మరో రెండేళ్ల వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి అవకాశం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో.. జంకె వెంకట రెడ్డి మళ్లీ అవకాశం వస్తుందా..? అనే ప్రశ్న ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో రేకెత్తుతోంది.