BJP, Somu Veerraju, Donations, Flood Victims – మీరు చేయాల్సిన పని ఇది కాదు సోము వీర్రాజు గారు..!

ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉన్న సోము వీర్రాజు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు అయినప్పుడు బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్ధతుదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏదో ఒక పార్టీకి తోకపార్టీగా ఉన్న బీజేపీ.. ఇకపై సొంతంగా ఎదుగుతుందని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందనే ఆకాంక్ష వారిలో మెదిలింది. సోము వీర్రాజు కూడా.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేస్తామని.. ఇలా బీజేపీ శ్రేణలను ఉత్సాహపరిచే ప్రకటనలు చేశారు. కానీ రోజు రోజుకి ఆయన నాయకత్వ సమర్థతపై బీజేపీ శ్రేణులకు ఉన్న నమ్మకాలు సన్నగిల్లిపోతున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయలు, చేస్తున్న కార్యక్రమాలే ఇందుకు ప్రధాన కారణం.

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను వరదలు ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ శతాబ్ధంలో చూడని వరదను ఆయా జిల్లాలు చూశాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ అంచనాలను ప్రధాన మంత్రికి, హోం మంత్రికి పంపుతూ.. తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖలు రాశారు.

ఈ పరిస్థితికి తగినట్లు రాజకీయాలు చేయాల్సిన సోము వీర్రాజు.. ఇందుకు భిన్నంగా వరద బాధితులకు సహాయం చేసేందుకు అంటూ బీజేపీ తరఫున రాష్ట్రంలో విరాళాలు సేకరించే కార్యక్రమానికి ఈ రోజు గురువారం శ్రీకారం చుట్టారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో రోడ్లపై వెళుతున్న ప్రజల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని సోము వీర్రాజు ప్రారంభించారు. రేపు శుక్రవారం కూడా విరాళాలు సేకరించాలని, రెండు రోజుల పాటు సేకరించిన విరాళాలు వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగిస్తామని ప్రకటించారు. గుంటూరు, తూర్పుగోదావరి.. ఇలా పలు చోట్ల బీజేపీ నేతలు కూడా సోము పిలుపును అందుకుని రోడ్లపైకి వచ్చి విరాళాలు సేకరిస్తున్నారు.

బీజేపీ జాతీయ పార్టీ. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సోము వీర్రాజు.. ఏమి చేయాలి..? ఏమి చేస్తున్నారు..? అనే ప్రశ్నలు సామాన్యులతోపాటు బీజేపీ శ్రేణులలోనూ రేకెత్తుతున్నాయి. ప్రజా సంఘాలు, సాధారణ పౌరుల మాదిరిగా రోడ్లపైకి వచ్చి వరద బాధితుల కోసమంటూ విరాళాలు సేకరిస్తున్న సోము తీరు హాస్యాస్పదంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా.. సాయం చేయాలంటూ సీఎం రాసిన లేఖలను ఆధారంగా చేసుకుని.. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా లను కలవాలి.

‘‘వరదలతో మా రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. నేను అక్కడకు వెళ్లి స్వయంగా చూశాను. ఈ విపత్కర సమయంలో మా రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం చేయండి. ఆదుకోండి..’’ అంటూ సోము అడగాలి. ఇదేమీ చేయకుండా.. ఓ చిన్న పార్టీ నేత మాదిరిగా, ఓ సాధారణ వ్యక్తిగా విరాళాలు సేకరిస్తూ.. తన నాయకత్వ లక్షణాలను సోము వీర్రాజు ఇలా చాటుకుంటున్నారు. ఈ తరహా నిర్ణయాలు, కార్యక్రమాలతో సోము వీర్రాజు బీజేపీ ని అధికారంలోకి తీసుకురాగలడా..? అనే సందేహం ఈ రోజు ఆ పార్టీ  శ్రేణులకు రాకుండా ఉండదు. ఇప్పటికైనా.. తన స్థాయికి తగినట్లు రాజకీయాలు చేస్తే సోము వీర్రాజుతోపాటు బీజేపీకి మంచిది.

Also Read : AP Floods, CM Jagan Letter – వరద ముంచెత్తింది.. ఆదుకోండి.. ప్రధానికి సీఎం లేఖ

Show comments