పార్టీ మీద స్వరం పెంచిన వరుణ్ గాంధీ

ఉత్తరప్రదేశ్ లో నిరసన చేస్తున్న 8 మంది రైతులను బలితీసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా నిరసన చెలరేగుతుంది. రైతులు అందరూ కూడా దేశ వ్యాప్తంగా… మరణించిన రైతులకు సంతాపం తెలియజేస్తున్నారు. రాజకీయంగా ఇది ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు బిజెపికి అక్కడ ఎదురు దెబ్బగా భావిస్తున్నారు పరిశీలకులు. ఇటువంటి ఘటనల విషయంలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నా సరే ఆలస్యం జరగడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇక బిజెపి నేతలు చేసిన విమర్శలు కూడా ఇక్కడ వివాదాస్పదంగా మారుతున్నాయి. బిజెపి అధికార ప్రతినిధి హరీష్ చంద్ర శ్రీవాస్తవ లఖింపూర్ ఖేరిలో ఆదివారం జరిగిన హింసకు “ఖలిస్తానీ” అంశాలే కారణమని వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. పోరాటం చేస్తున్న రైతులపై ఈ విధమైన దారుణమైన భాష ఉపయోగించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ కొందరు వ్యక్తులు చేసిన తప్పు కారణంగానే హింస చెలరేగింది అని, కాబట్టి ప్రభుత్వాన్ని నిందించలేము అన్నారు.

Also Read : రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి

ఇక నేడు ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. లఖింపూర్ ఖేరిలో రైతులను చితకబాదిన కార్ల యజమానులను అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ పోలీసులను కోరారు. ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేస్తూ ఆయన పోలీసులకు ఈ విజ్ఞప్తి చేసారు. “వాహనాలను ఉద్దేశపూర్వకంగా రైతుల మీదుగా నడిపిస్తున్న వీడియో ఎవరినైనా గందరగోళానికి గురి చేస్తుంది. ఈ వీడియోను పోలీసులు గమనించి, దాని లోపల కూర్చున్న వారితో పాటు కార్ల యజమానులను అరెస్టు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు.

ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మరణానికి పాల్పడిన వారిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో వరుణ్ గాంధీ నిరసన తెలిపే రైతుల పట్ల సంయమనం మరియు సహనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని, చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు తాను నివాళి అర్పిస్తున్నా అన్నారు.

Also Read : ల‌ఖీంపూర్‌ ఘటన తర్వాత ఏం జరుగుతోంది..?

ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని యుపి ముఖ్యమంత్రిని కోరారు ఆయన. ఈ విషయంపై బిజెపి అధికారికంగా మౌనం పాటించినప్పటికీ వరుణ్ గాంధీ దీనిపై స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఆయన రైతులకు మద్దతు ఇచ్చారు. రైతులు చేస్తున్న నిరసనకు సంబంధించి చాలా జాగ్రత్తగా కేంద్రం ముందుకు వెళ్ళాలి అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు రైతులతో మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అనవసరమైన విమర్శలకు దూరంగా ఉండి వారి డిమాండ్ లను పరిశీలించాలి అని విజ్ఞప్తి చేసారు.

Show comments