BJP, Corporator, Meerpet – పార్టీ మారిన కార్పొరేటర్‌పై కోడిగుడ్లు

రాజకీయ నేతలన్నాక పార్టీలు మారడం సహజమే. అయితే.. తెలంగాణలోని మహేశ్వరం నియోజకవర్గంలో ఓ కార్పొరేటర్‌ పార్టీ మారడం రాజకీయంగా ఉద్రిక్తతను రేపింది. మీర్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష బీజేపీల మధ్య పొలిటికల్‌ వార్‌ మొదలైంది. బీజేపీ కార్పొరేటర్‌ ఒకరు టీఆర్‌ఎస్‌లో చేరడమే ఇందుకు ప్రధాన కారణమైంది.

మీర్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎం.నరేంద్రకుమార్‌ సబితారెడ్డి సమక్షంలో సోమవారం రాత్రి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, బీజేపీ సింబల్‌తో పోటీలో నిలబడ్డారు కాబట్టే ఆయన గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచారంటూ కాషాయ శ్రేణులు స్థానికంగా ఆందోళనకు దిగారు. కార్పొరేటర్‌ ఇల్లు ముట్టడించి.. ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. నరేంద్రకుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీజేపీ మీర్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బడంగ్‌పేట్‌లోని వెంకటాద్రి నివాస్‌లో ఉన్న నరేంద్రకుమార్‌ ఇల్లు ముట్టడించారు. సమాచారం అందుకున్న మీర్‌పేట్‌ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుంచి గెలిచి తన స్వార్థం కోసం, మంత్రి పదవి కోసం టీఆర్‌ఎస్‌లో చేరిన సబితారెడ్డి.. మీర్‌పేట్‌లోనూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజా నిర్ణయాన్ని మంటగలిపారని, ఇప్పుడు ఇతర పార్టీల కార్పొరేటర్లను సైతం తన దారిలోనే నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే అటు సబితారెడ్డి, ఇటు నరేంద్రకుమార్‌ ఇద్దరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి, కారు గుర్తుపై పోటీ చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు.

మహేశ్వరంలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నరేంద్రకుమార్‌ ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేయడం సిగ్గుచేటని టీఆర్‌ఎస్‌ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం మీర్‌పేట్‌లో కార్పొరేటర్‌ నరేంద్రకుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్‌ దుర్గాదీప్‌లాల్‌, డిప్యూటీ మేయర్‌ విక్రమ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కామేశ్‌రెడ్డి బీజేపీ దాడిని ఖండించారు. బీజేపీలో ఉంటే డివిజన్‌లో అభివృద్ధి జరగడం లేదని, అందుకే నరేంద్రకుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. ఇటీవల స్వతంత్ర కార్పొరేటర్‌ మల్లేశ్‌ముదిరాజ్‌ బీజేపీలో చేరారని, ఆయన సైతం రాజీనామా చేసి మళ్లీ బీజేపీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని వారు సవాల్‌ విసిరారు. మొత్తంగా కార్పొరేటర్‌ పార్టీ మారడం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో రాజకీయ వేడిని రగిలించింది.

Show comments