BAC Meeting – బాబుని చూడాలి, పెద్దవారు అచ్చెన్న గారు: జగన్ చలోక్తులు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా జరిగిన బిఎసి సమావేశంలో సిఎం జగన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. కుప్పం, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఏసీలో ప్రస్తావనకు రాగా సిఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు చంద్రబాబును తీసుకు రండి.. కుప్పం ఫలితాలు తర్వాత ఆయనను చూడాలని ఉందని సీఎం జగన్ చలోక్తులు విసిరారు. గెలుపోటములు సర్వసాధారణమేనన్న అచ్చెన్నాయుడు… చంద్రబాబు సభకు కచ్చితంగా వస్తారని స్పష్టం చేశారు.

ఇక నెల్లూరు ఎన్నికల గురించి మంత్రి అనిల్ ప్రస్తావిస్తూ… నెల్లూరులో అచ్చెన్న ఇన్ఛార్జీగా ఉన్నారని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అచ్చెన్న బీఏసీలో ఎన్నికల ప్రస్తావన దేనికి..? ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసన్నారు. సభకు చంద్రబాబు వచ్చేలా చూడాలని ఒకటికి రెండు సార్లు అచ్చెన్న వద్ద జగన్ ప్రస్తావించారు. అలాగే కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఎలా గెలిచారో మీకూ తెలుసు.. మాకూ తెలుసని అచ్చెన్న అన్నారు.

ఇక సభా సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని అచ్చెన్న డిమాండ్ చేయగా జగన్ సానుకూలంగా స్పందించారు. ఒక్క రోజు మాత్రమే సభను జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ పేర్కొనగా… కోవిడ్ సమయంలో సభను ఆన్ లైన్ ద్వారా నడపాలని గతంలో టీడీపీనే ప్రస్తావించింది కదా అని బుగ్గన ప్రస్తావించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జగన్… గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన ప్రత్యేకంగా అడుగుతున్నప్పుడు అంగీకరించకుంటే ఎలా అని అంటూ ఈ నెల 26వ తేదీ వరకు సభ జరుపుదామన్నారు. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని మంత్రులు అనగా దానికి పెద్ద హడావుడెందుకు లిమిటెడుగా ఎమ్మెల్యేలు వెళ్తే సరిపోతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్షం అడిగిన వెంటనే సీఎం అంగీకరించడం ఓ చరిత్రేనని మంత్రి బుగ్గన బదులు ఇచ్చారు.

Also Read : Ap Assembly – ఏడురోజుల పాటు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు..

Show comments