AP Council, Abolished Bill – మండలి యధాతథం.. ఏపీ శాసన సభలో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి యధాతథంగా కొనసాగనుంది. పెద్దల సభగా పిలిచే కౌన్సిల్‌ను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వైసీపీ సర్కార్‌ విరమించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తుండడంతో పెద్దల సభను రద్దు చేయాలని గత ఏడాది జనవరి 27వ తేదీన వైసీపీ సర్కార్‌ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మండలిని రద్దు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రద్దు బిల్లును వెనక్కి తీసుకుంటూ ఈ రోజు శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టింది. సభ ఆ బిల్లును ఆమోదించింది.

ఇటీవల వరకు శాసన మండలిలో టీడీపీదే ఆధిపత్యం. దీంతో శాసన సభ ఆమోదించే బిల్లులను, ప్రజాప్రయోజాల కోసం రూపొందించే బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకునే చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే గత ఏడాది జనవరి 25వ తేదీన శాసన మండలికి రెండోసారి వచ్చిన మూడురాజధానుల బిల్లును ఆమోదించకుండా.. నిబంధనలకు విరుద్ధమని చెబుతూనే అప్పటి టీడీపీ నేత, చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. పెద్దల సభగా పిలుచుకునే మండలి ఈ విధంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ అంశంపై శాసన సభలో చర్చించాలని స్పీకర్‌ను కోరారు. మండలి వ్యవహరిస్తున్న తీరుపై చర్చించిన శాసనసభ.. ఆఖరుకు మండలిని రద్దు చేయాలని తీర్మానించింది. దాన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కోవిడ్‌ నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయసభలు సరిగా సాగకపోవడంతో ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మండలి రద్దు నిర్ణయాన్ని జగన్‌ సర్కార్‌ విరమించుకుంది. ఏపీ శాసన మండలిలో 58 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం టీడీపీ సంఖ్యా బలం 12కు పడిపోయింది. వైసీపీ సభ్యులు 18 మంది ఉన్నారు. శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీలు ముగ్గురు ఏకగ్రీవం అయ్యారు. ఈ రోజు లేదా రేపు వారు ముగ్గురు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెలాఖరు లేదా డిసెంబర్‌ 14వ తేదీ నాటికి స్థానిక సంస్థల కోటాలోని 11 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. అవన్నీ వైసీపీకి దక్కనున్నాయి. ఫలితంగా వైసీపీ బలం మండలిలో 32కు చేరుకుంటుంది. మొత్తం సభ్యులు 58 మందిలో మెజారిటీ సభ్యులు  వైసీపీకే ఉంటారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లు అయినా ఇకపై శాసన సభతోపాటు మండలిలోనూ సులువుగా ఆమోదం పొందడం లాంఛనమే కానుంది.

Also Read : YS Jagan, Council Abolition Bill – శాసన మండలి రద్దు బిల్లుపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం..?

Show comments