Idream media
Idream media
దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ముగింపునకు వచ్చిందా..? అందుకే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ వైసీపీ సర్కార్ మూడు ప్రాంతాలలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు ఉభయ సభల్లో బిల్లును కూడా అమోదించింది. అయితే అమరావతి ప్రాంతంలోని కొంత మంది, టీడీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతుండగానే.. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి రాజధాని బిల్లుపై కేబినెట్ చర్చించి నిర్ణయం వెలువరిస్తుందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలియజేయడంతో.. తుదపరి ఏం జరగనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఒకే రాజధానిగా వైజాగ్…?
మూడు రాజధానులలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ. రాయలసీమలోని కర్నూలులో న్యాయరాజధాని, ఉత్తరాంధ్రలోని విశాఖలో కార్యనిర్వాహఖ రాజధాని ఏర్పాటుకు జగన్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే మూడు రాజధానుల అమలులో సాంకేతికపరమైన సమస్యలు వచ్చేఅవకాశం ఉందనే సంకేతాలు ఉండడంతో.. ఈ ప్రతిపాదనను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా.. మరెలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఒకే రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఏకైక రాజధానిగా వైజాగ్‌ను ఎంపిక చేస్తూ.. అందుకు అందుకు అనుగుణంగా త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
సమగ్రాభివృద్ధి లక్ష్యం నెరవేరేలా చర్యలు..
ఇదే సమయంలో.. మూడు రాజధానుల ఏర్పాటు ఉద్దేశం దెబ్బతినకుండా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కీలకమైన ప్రతిపాదనలు నూతన రాజధాని బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న తీవ్రమైన వ్యత్యాసాన్ని తగ్గించడమే లక్ష్యంగా.. వెనుకబడిన జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలన్నదే జగన్ సర్కార్ ఆలోచన. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నాయి. సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, తలసరి ఆదాయం, విద్య, జీవన ప్రమాణాలు.. ఇలా ఏ అంశంలో చూసిన.. ఉత్తరాంధ్ర, సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు.. సీఎం జగన్ నూతన రాజధాని ఏర్పాటు బిల్లు ద్వారా పటిష్టమైన చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read : Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం