AP Govt. PRC – చర్చలకు శ్రీకారం.. పీఆర్‌సీపై ఏం తేల్చబోతున్నారు..?

సుదీర్ఘ కసరత్తు తర్వాత.. పీఆర్‌సీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నివేదికను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సోమవారం అందజేసింది. తాము ఎలాంటి సిఫార్సులు చేశాము అనే విషయాలను సమీర్‌ శర్మ మీడియాకు వెల్లడించారు. పీఆర్‌సీ నివేదిక ఉద్యోగులకు అందుబాటులో ఉంచారు. మరో మూడు రోజుల్లో పీఆర్‌సీపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సమీర్‌ శర్మ చెప్పారు.

పీఆర్‌సీపై కమిటీ సిఫార్సులను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఫిట్‌మెంట్‌ 14.29 శాతం నుంచి 30 శాతం వరకు ఏడు సిఫార్సులను కమిటీ చేసింది. 14.29 శాతం ప్రతిపాదనను తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపింది. అయితే ఏడు ప్రతిపాదనల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేనికి ఆమోదం తెలుపుతారనేది ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం.

కమిటీ నివేదిక ఇవ్వడం, సిఫార్సులపై ఉద్యోగ సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో పీఆర్‌సీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. పీఆర్‌సీపై చర్చించేందుకు రావాలంటూ ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ రోజు మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కాబోతున్నారు. సమావేశం అనంతరం.. ఉద్యోగుల డిమాండ్లను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఉభయతారకంగా.. ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాతే.. ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

Also Read : ఉద్యోగుల పీఆర్సీలో కీలక మార్పులు, భవిష్యత్తులో వేతన సవరణ సంఘాలుండవు

Show comments