Idream media
Idream media
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ తిరిగి పూర్వ పరిస్థితులు తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రెండు వేల రూపాయలు, ఇళ్లు కోల్పోయిన వారికి కొత్త ఇళ్లు, ఇళ్లు దెబ్బతిన్న వారికి 95,100 రూపాయల పరిహారం ఇస్తామని చెప్పిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాలను వీలైనంతగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సాయం కోరారు. నాలుగు జిల్లాలను వరద ముంచెత్తిందని, తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుతాన్ని కోరారు.
ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా లకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖలో వరదల వల్ల నాలుగు జిల్లాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నది, జరిగిన నష్టం వివరాలను పొందుపరిచారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో సహా వందలాది చెరువులకు గండ్లు పడ్డాయని సీఎం జగన్ ఆ లేఖలో వివరించారు. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో జరిగిన ఆస్తి నష్టం గురించి వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వరదల వల్ల 6.54 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సీఎం జగన్ మోదీ, అమిత్‌షాలకు తెలిపారు. 40 మంది మరణించారని పేర్కొన్నారు. వరద నష్టం అంచనా వేసేందకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను పంపాలని సీఎం ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. విభాగాల వారీగా జరిగిన నష్టాన్ని ఈ లేఖలో సీఎం జగన్ పొందుపరిచారు.
కాగా, మరో వైపు సీఎం వైఎస్ జగన్ ప్రతి రోజు వరద సహాయ చర్యలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈ రోజు కూడా సీఎం వైఎస్ వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులను వరద సహాయక చర్యల్లో పాల్గొనేలా సీఎం ఆదేశించారు.