Three Capitals, AP High Court – చట్టాల ఉపసంహరణ సమాప్తం.. ఆ ఒక్కటే మిగిలింది..

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ చేసిన చట్టాల రద్దు ప్రక్రియ పరిసమాప్తమైంది. సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించిన ఏపీ సర్కార్‌.. ఆ మేరకు ఈ నెల 22వ తేదీన శాసన సభలో, 23వ తేదీన శాసన మండలిలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్ర పురపాలక శాఖ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్‌కు రెండు సభలు ఆమోదించిన బిల్లుల కాపీలను జత చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో అందుకనుగుణంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టును కోరింది.

రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో మూడు చోట్ల మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. అమరావతిలోని కొంత మంది రైతులు, టీడీపీ నేతలు హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. రాజధాని అంశానికి సంబంధించిన అన్ని పిటీషన్లు కలిపి విచారణ చేయాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. రోజు వారీ విచారణ జరిపి, వీలైనంత త్వరగా ఈ వివాదాల్ని పరిష్కరించాలని సూచించింది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన విచారణ.. ఇటీవల ప్రారంభమైంది.

అయితే.. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుండడంతో.. అసలు మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తెచ్చాము..? అవసరం ఏమిటి..? అనే అంశాలను కూడా బిల్లులో పొందుపరిచి, అందరి అనుమానాలను తీర్చేందుకు.. కొత్త చట్టాలను తెస్తామని సీఎం జగన్‌ ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో ప్రకటించారు. అందుకోసం ప్రస్తుతం చేసిన చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేశారు. అదే రోజు హైకోర్టుకు ఈ విషయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ తెలియజేశారు. ఈ విషయంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఈ మేరకు ఈ రోజు సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రెండు చట్టసభలు ఆమోదించిన బిల్లులతో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇక హైకోర్టు ఆదేశాలు రావడమే తరువాయి.. మూడు రాజధానుల అంశంపై నెలకొన్న వివాదాలు అన్నీ పరిసమాప్తమైనట్లే.

Show comments