AP CID, Rtd IAS Lakshmi Narayana – స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. సీఐడీ నోటీసులు.. ఆస్పత్రిలో చేరిన లక్ష్మీనారాయణ

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. ఈ రోజు ఆ సంస్థ పూర్వ సలహాదారు, మాజీ ఐఏఎస్‌ లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అనంతరం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు చేసేందుకు సీఐడీ అధికారులు అపసోపాలు పడ్డారు. లక్ష్మీ నారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులు సీఐడీ అధికారులకు అడ్డుతగిలారు. ఎట్టకేలకు సోదాలు పూర్తి చేసి, నోటీసులు జారీ చేయడంతో.. లక్ష్మీ నారాయణ ఖంగుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆయన్ను కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

చంద్రబాబు ప్రభుత్వ హాయంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంస్థకు లక్ష్మీ నారాయణ సలహాదారుడుగా పని చేశారు. అంతకు ముందు చంద్రబాబు వద్ద ఓఎస్డీ గా పని చేసిన లక్ష్మీనారాయణ.. బాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. లక్ష్మీ నారాయణ సలహాదారుడుగా ఉన్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో 241.78 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే అభియోగాలపై ఈ ఏడాది జూలై 11వ తేదీన సీఐడీ కేసులు నమోదు చేసింది.

విద్యార్థులకు కాలేజీ స్థాయిలోనే వారి కోర్సులకు అనుగుణంగా నైపుణ్యత అందించే కార్యక్రమంలో ప్రభుత్వం కేటాయించిన నిధులను షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారనేది లక్ష్మీ నారాయణపై ఉన్న అభియోగం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ మొత్తం ఖర్చు చేశాయి.  నైపుణ్య శిక్షణ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 370.78 కోట్ల రూపాయల నిధుల్లో.. 241.78 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, శిక్షణ కేంద్రాలు, యూనివర్సిటీలలో విద్యార్థులకు శిక్షణ అందించినట్లుగా చూపుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సీమన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలు.. షెల్‌ కంపెనీలకు భారీ మొత్తంలో నిధులు మళ్లించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఐడీ విచారణ మొదలు పెట్టింది.

Also Read : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం.. మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సోదాలు.. సీఐడీని అడ్డుకున్న ఏబీఎన్‌ రాధాకృష్ణ

Show comments