Idream media
Idream media
ఏపీ బీజేపీ నేతలకు కోవర్టుల భయం పట్టుకుంది. అంతరంగిక సమావేశాల వివరాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయట. ఎవరో మనలోనే కావాలనే మీడియాకు లీకులు ఇస్తున్నారన్న చర్చ పార్టీలో మొదలైంది. తనకు అత్యంత విశ్వాసపాత్రులకు ఫోన్లు చేసి ఏపీ చీఫ్ సోము వీర్రాజు దీనిపై ఆరా తీస్తున్నారట. ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది.
ఇటీవల అమిత్ షా..తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన ఇక్కడ షెడ్యూల్ ముగించుకుని.. చివరిరోజు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర పార్టీ పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఏ పార్టీతో దగ్గరవ్వాలి..? ఏం చేయాలి? వచ్చే ఎన్నికల్లో.. ఎలాంటి వ్యూహాలు వేసుకోవాలి? వంటి కీలక అంశాలపై అత్యంత రహస్యంగా చర్చించారు. దీనికి మీడియాను కూడా ఎంటర్ చేయలేదు. అంతేకాదు.. నాయకుల మధ్య సఖ్యతను ఏర్పరిచే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీతో ఎలా వ్యవహరించాలి. వైసీపీ తో ఎలా ఉండాలో కూడా చెప్పారు. ఇవన్నీ అత్యంత రహస్యంగా సాగిన వ్యవహారాలే. అయితే.. వీటిలో కొన్ని ప్రజలకు తెలియాల్సిన అంశాలపై.. రాష్ట్ర పార్టీ చీఫ్.. సోము వీర్రాజు ప్రెస్మీట్ పెట్టి.. మీడియాకు వివరించాలని అనుకున్నారట.
అమిత్ షా వీరికి దిశానిర్దేశం చేసిన రోజు రాత్రి చాలా సమయం అయిపోవడంతో ఆయన మీడియా ముందుకు రాలేదు. తెల్లవారి మీడియా మీటింగ్ పెట్టాలని అనుకున్నారు. కానీ తెల్లవారి చూసుకుంటే.. తాను చెప్పాలని అనుకున్న వాటితో పాటు.. అత్యంత కీలకమైన విషయాలు, రహస్య సంభాషణల సారాంశం కూడా పలు పేపర్లలో వచ్చేసిందట. వీటిని తిరుపతిలోనే చూసిన సోము.. అవాక్కయ్యారట.
ఇదేంటి? అంటూ.. తనకు అత్యంత విశ్వాసపాత్రులకు ఫోన్లు చేసి.. నేను చెప్పాలనుకున్న విషయాలు వచ్చాయి.. బాగానేఉంది. కానీ చెప్పకూడదని అనుకున్న విషయాలు కూడా మీడియాకు ఎలా వచ్చాయి. అది కూడా ఒక వర్గం మీడియాకు మాత్రమే ఎందుకు వచ్చాయని ప్రశ్నించారట.
అయితే.. దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. ఎవరో కీలక నాయకుడు.. రాజధాని జిల్లాలకు చెందిన ఓ సామాజిక వర్గం నాయకుడే కోవర్టుగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు మాత్రం ఇచ్చారట. దీనిపై సోము చాలా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అప్రమత్తంగా వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చారట. అప్రమత్తత అంటే సమావేశాలు పెట్టడమే మానేస్తారా?