Idream media
Idream media
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల (బీసీ) వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధి కోసం బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఈ దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండున్నరేళ్లలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీలకు పెద్దపీట వేసిన జగన్.. తాజాగా ఈ అంశంలో మరో అడుగు ముందుకు వేశారు.
కులాల వారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో.. సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలలో ఆయా వర్గాల వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని భావించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. 2021 జనాభా గణనలో కులాల వారీగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బీసీ గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అంశంపై చర్చించిన శాసన సభ.. ఆ తీర్మానాన్ని ఆమోదించింది.
దేశంలో ప్రతి పదేళ్లకు జనాభాను గణిస్తున్నా కులాల వారీగా ఎంత జనాభా ఉందనేది లెక్కించడం లేదు. బ్రిటీషు వారి హాయంలో 1931లో కులాల వారీగా గణించిన లెక్కలే ఇప్పటికీ ఆధారం. స్వాతంత్ర భారతంలో కులాల వారీగా గణన చేపట్టలేదు. 90 ఏళ్లలో జనాభా పలురెట్లు పెరిగింది. కులాల సంఖ్యా పెరిగింది. 1931లో దేశంలో 4,300 కులాలు ఉన్నట్లు తేలగా.. 2011లో చేసిన జనాభా లెక్కల్లో దేశంలో 21 లక్షల కులాలు ఉన్నట్లు తేలింది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 2.30 లక్షల కులాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వాల సంక్షేమ పాలన అంతా కులాల ఆధారంగానే సాగుతోంది. ఆయా కులాల వారి జనాభా (అంచనా) ఆధారంగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు జరుగుతోంది.
Also Read : 3 Capitals -టీడీపీ ఉక్కిరిబిక్కిరి, అధికార పార్టీ ఎత్తులతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం
అయితే కులాల వారీగా జనాభా ఎంత ఉందనే విషయం స్పష్టంగా తెలియకపోవడం వల్ల.. ఆయా వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పూర్తి స్థాయిలో అందడంలేదనే భావన నెలకొంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది. కోవిడ్ సమయంలోనూ ఏపీలో ఏ ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బంది పడలేదంటే జగన్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం. రాజకీయంగానూ వెనుకబడిన వర్గాల వారికి జగన్ పెద్దపీట వేస్తున్నారు. రాజ్యసభ, శాసన మండలిలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు 50 శాతం కన్నా ఎక్కువగా పదవులు కట్టబెట్టారు. సంక్షేమ పథకాలతోపాటు విద్య, ఉద్యోగాల భర్తీలో.. బీసీలకు తగిన అవకాశాలు కల్పించేందుకు బీసీ గణన ఉపయోగపడుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ఇప్పటికే బీసీ గణన చేపట్టాలని బీహార్, తెలంగాణ రాష్ట్రాలు తమ అసెంబ్లీలలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. తాజాగా ఏపీ కూడా తీర్మానం చేయడంతో ఈ అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం.. కులాల వారీగా జన గణన చేపడితే.. సమస్యలు వస్తాయని చెబుతోంది. రాష్ట్రాల నుంచి డిమాండ్లు ఊపందుకోవడంతో.. కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందా..? లేదా..? వేచి చూడాలి.
Also Read : AP Council, Abolished Bill – మండలి యధాతథం.. ఏపీ శాసన సభలో కీలక పరిణామం