Andhra Jyothi, Chandrababu – బాబు చేసిన నష్టానికి ఆంధ్రజ్యోతి ప్యాచ్‌వర్క్‌

టీడీపీ శ్రేయస్సే.. తమ శ్రేయస్సు అని భావించే ఆంధ్రజ్యోతి పత్రిక.. నిత్యం ఆ కోణంలోనే పని చేస్తోంది. టీడీపీ ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసే రాతలు, టీడీపీకి నష్టం జరిగితే దాన్ని కవర్‌ చేసే కథనాలు.. ఇలా సాగుతోంది ఆంధ్రజ్యోతి జర్నలిజం. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ‘‘ జనంలోకి వెళ్లేందుకు జంకు’’ అనే శీర్షికతో ఓ కథనం ప్రచురించింది. ఇటీవల వరద ప్రాంతాలలో సీఎం జగన్‌ పర్యటన పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ పర్యటనలో సీఎం జగన్‌ పట్ల బాధితులు చూపించిన ఆప్యాయత, కృతజ్ఞతాభావంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కడుపు మంటతో మాట్లాడిన మాటలు వైరల్‌ అయ్యాయి. సీఎం జగన్‌ పర్యటన విజయవంతమైందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో అందరికీ అర్థమైంది.

‘‘వరదలు వచ్చినప్పుడు సీఎం వెళితే.. బాధతో వచ్చి, సర్‌.. మాకు అది చేయండి.. ఇది కావాలి అని అడగకుండా.. బాగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మీరు ఇంద్రుడు, మీరు దేవుడు అని పొగుడుతారా..? గడ్డం పట్టుకుని ప్రేమలు కురిపిస్తారా..?’’ అంటూ చంద్రబాబు సీఎం జగన్‌ పర్యటనలో వరద బాధితులు వ్యవహరించిన తీరును తూర్పారబట్టారు. వారికి బుద్ధిలేదు, జ్ఞానం లేదంటూ తిట్టిపోశారు. బాబు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఏమో గానీ.. ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల వైసీపీ ప్రభుత్వానికి, వైఎస్‌ జగన్‌కు మంచి జరిగింది. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన వైసీపీ ప్రభుత్వం సాయం అందించిందన్న విషయం ప్రతిపక్ష నేతే ఒప్పుకున్నారు. అధికార పార్టీ ఎంత చెప్పుకున్నా.. ఈ తరహా ప్రచారం, మంచి గుర్తింపు రాదు.

ఈ విషయం గుర్తించిన చంద్రబాబు.. నష్ట నివారణ చేపట్టారు. తన వ్యాఖ్యలపై మళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి వివరణ ఇచ్చుకునే పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రజ్యోతి రంగంలోకి దిగింది. బాబు చేసిన నష్టానికి ప్యాచ్‌ వర్క్‌లు వేయడం ప్రారంభించింది. అందుకే సీఎం జగన్‌.. జనంలోకి వెళ్లేందుకు జంకుతున్నారంటూ ఈ రోజు రాసుకొచ్చింది. హామీలు అమలు చేయకపోవడం వల్ల, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, పింఛన్లు కట్‌ చేయడం వల్ల.. జగన్‌ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. ఇచ్చిన ప్రతి హామీని జగన్‌ అమలు చేశారు. టీడీపీ దిగిపోయే సమయానికి రాష్ట్రంలో 53 లక్షల మంది పింఛన్లు తీసుకుంటుంటే.. ఇప్పుడు వారి సంఖ్య 60 లక్షలపైగానే ఉంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 1.30 లక్షల ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా భర్తీ చేసి రికార్డు సృష్టించారు. భారతీయ రైల్వే కూడా ఒకే సారి ఇంత మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయలేదు.

వాస్తవాలు ఇలా ఉంటే.. ఆంధ్రజ్యోతి అలా రాసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటో పాఠకులకు తెలియంది కాదు. వరద ప్రాంతాలలో జగన్‌ రెండు రోజుల పర్యటన ఈ నెల 3వ తేదీన ముగిసింది. నిజంగా ఇలాంటి కథనం రాయాల్సి ఉంటే.. మరుసటి రోజు.. అంటే ఈ నెల 4వ తేదీనే ప్రచురించాల్సి ఉండాల్సింది. కానీ మూడు రోజుల తర్వాత ఈ రోజు అచ్చేయడం వెనుక.. చంద్రబాబు వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టానికి ప్యాచ్‌ వర్క్‌ కోసం తప్పా.. మరో లక్ష్యం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Also Read : Chandrababu – ప్రజలు సంతోషంగా ఉన్నా ఓర్వలేకున్నారా? బాబూ!

Show comments