Nellore Corporation – సింహపురి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగంగా చేస్తోంది. ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. 425 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బాబు పరిశీలించారు. ఇప్పటికే ఆర్‌వో, ఏఆర్‌వోలను నియమించినట్లు కలెక్టర్‌ చెప్పారు. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది మార్చిలో 16 కార్పొరేషన్లకు గాను 12 నగరపాలికలకే ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్‌ పాలకమండలికి గడువు ఉండగా.. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థల్లో పంచాయతీల విలీనంపై వివాదాలు నెలకొన్నాయి. నెల్లూరులో డివిజన్ల సరిహద్దులు, డివిజన్ల మధ్య ఓటర్ల జాబితాలో భారీ వ్యత్యాసాలు ఉండడంతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. 54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో.. ఒక డివిజన్‌లో నాలుగు వేల ఓట్లు ఉండగా.. మరో డివిజన్‌లో 18 వేల ఓట్లు ఉన్న పరిస్థితిని చక్కదిద్దాలనే హైకోర్టు ఆదేశాలతో అధికార యంత్రాంగం ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నెల 23వ తేదీ పోలింగ్‌ కేంద్రాల జాబితాతో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయనున్న నేపథ్యంలో.. సిద్ధం చేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ఈ రోజు పరిశీలించారు.

Also Read : Badvel By Poll TDP – బద్వేలు ఉప ఎన్నికలు మళ్లీ బాబు కొరివితో తలగోక్కుంటున్నట్టేనా

1884లో మున్సిపాలిటీగా ఏర్పడిన నెల్లూరు 2004లో కార్పొరేషన్‌గా మారింది. 54 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అందులో ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీలు నెల్లూరు నగరాన్ని పాలించాయి.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు నగరపాలక సంస్థను అధికార వైసీపీ గెలుచుకోవడం లాంఛనమే. వైసీపీకి మంచి పట్టు ఉన్న జిల్లాల్లో కడప తర్వాత స్థానం నెల్లూరుదే. గడచిన కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీనే మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంది. 2014 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానంతోపాటు 10 అసెంబ్లీ సీట్లకు గాను ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఎంపీ సీటుతోపాటు పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది.

వైసీపీ బలంగా ఉండగా, టీడీపీకి నాయకత్వమే కొరవడింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన పి.నారాయణ 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అమరావతి భూ కుంభకోణంపై ఆరోపణలు వచ్చినప్పుడు వచ్చి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఏడాదిన్నరగా నారాయణ ఎవరికీ కనిపించ లేదు. టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న నారాయణ పూర్తిగా సైలెంట్‌ కావడంతో.. టీడీపీని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న మెదులుతోంది. ప్రస్తుతం నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అబ్ధుల్‌ అజీజ్‌ మాత్రమే ఆ పార్టీలో పెద్ద తలకాయలుగా కనిపిస్తున్నారు.

Also Read : Municipal Elections – మినీ మున్సిపోల్‌కు రంగం సిద్ధం.. అందరి దృష్టి కుప్పం పైనే..

Show comments