Idream media
Idream media
చంద్రబాబు ఏడిస్తే టీడీపీలోని చాలా మందికి సంతోషంగా ఉంది. అదేనండీ.. పార్టీపై సానుభూతి పెరుగుతుందన్న లెక్కతో. ఎవరి లెక్కలు ఎలాగున్నా అచ్చెన్నాయుడు మాత్రం తెగ లెక్కలు కట్టేస్తున్నారు. తిరుపతి లో ఓ సందర్భంగా ఈ ఎన్నికలై పోతే.. “పార్టీ లేదు.. అదేదో లేదు..” అంటూ టీడీపీని తీసిపారేసిన అచ్చెన్న ఇప్పుడు అధికారంపై ధీమా వ్యక్తం చేయడమే కాదు.. అందరి పనీ పడతాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇలాంటి హెచ్చరికలు గతంలో కూడా చాలా సార్లు చేశారనుకోండి. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు ఏడుపు కలిసొస్తుందనే నమ్మకంతోనే ఆయన ఇలా మాట్లాడడం. అయితే దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
తెలుగుదేశానికి ఇప్పటి నుంచి అన్నీ మంచిరోజులే అంటూ ఏపీ ప్రెసిడెంట్ కింజారపు అచ్చెన్నాయుడు తెగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలకు, ఇప్పటికి పరిస్థితిలో ఏం మార్పు వచ్చిందో మరి ఆయనకే తెలియాలి. బాబు ఏడుపే ఆయనలో ఈ ధీమాకు కారణమని తెలుస్తోంది. అయితే ఏపీలో వైసీపీ పని అయిపోయిందని, ఇక వారు ఖచ్చితంగా ఉండేది రెండున్నరేళ్లు మాత్రమే అని పేర్కొనడం ఊహాలోకంలో విహరించడమే. ఎందుకంటే.. ప్రజలు ఇలాంటి ఘటనలను ఇలా చూసి అలా మరిచిపోతూ తమ పనుల్లో బిజీ అవుతున్నారు. కేవలం తమ కుటుంబాలకు, పిల్లలకు జరిగిన మేలే గుర్తుంచుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ.
తమ పార్టీ వారు ఆందోళనలు చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ కూన రవికుమార్ ని అర్థరాత్రి ఇంటి తలుపులు బద్దలుకొట్టి మరీ అరెస్ట్ చేశారంటూ ఉదహరించారు. అయితే ఇక్కడ కూన చేసిన ఓవరాక్షన్ అచ్చెన్నాయుడుకు కనిపించలేదా అన్నదే ప్రశ్న. కూన ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను ఇంట్లోనే ఉండాలని.. శాంతిభద్రతల సమస్యను తీసుకురావొద్దని చెప్పారు. తాను నిరసన చేయకుండానే.. చేస్తానంటూ పోలీసులు తన ఇంట్లోకి వచ్చి హడావుడి చేయటంపై కూన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘డ్యూటీయా? నా ఇంటి లోపలకు నువ్వు పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగగొడతా.. ఏదైనా ఉంటే రోడ్డుపై చేస్కో.. రేప్పొద్దున కోర్టుకు రారా.. నిన్ను నీ ఉద్యోగం నీ యూనిఫాం లేకుండా చేస్తా.. రెండున్నరేళ్ల తర్వాత నీకు ఉద్యోగం ఉండదు గుర్తుపెట్టుకో.. నేను దృష్టి పెడితే అప్పటి వరకు కూడా అక్కర్లేదు.. నీ భుజం మీద యూనిఫాం ఎలా ఉంటుందో చూస్తా.. నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో’ అంటూ సీఐ ప్రసాద్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. ఒకసారి దురుసుగా తన చేతిని సీఐ భుజానికి తాకారు. అది అచ్చెన్నకు తప్పుగా అనిపించడం లేదేమో.
అలాగే.. ఎన్ని అరెస్టులు చేసుకున్నా మిగిలింది రెండున్నరేళ్ళు మాత్రమే అని హెచ్చరిస్తున్నారు. ఆ తరువాత వచ్చేది ఖచ్చితంగా తామేనని ఇంతకు ఇంతా తాము బదులు తీర్చుకుంటామని కూడా అచ్చెన్న ప్రతిన చేస్తున్నారు. అచ్చెన్న ఈ మాటలు అనడం వెనక చాలానే కథ ఉందని తెలుస్తోంది. ఏపీ లో చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ తరువాత రాజకీయంగా కూడా టీడీపీకి ప్లస్ అయిందని అచ్చెన్న అంచనా కడుతున్నారు. స్లో.. స్లో.. స్పీడైపోమాకా.. మున్ముందు స్టోరీ మారిపోద్దంటూ పలువురు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.