Bhopal Gas Tragedy – భోపాల్ విషాదానికి 36 ఏళ్ళు

ఎప్పటి లాగే ఆ రాత్రి భోజనం చేశారు. కాసేపు ముచ్చట్లు సాగించారు. పిల్లల భవిష్యత్ పై తల్లిదండ్రులు, ఆ రోజు స్కూల్ లో జరిగిన పాఠాలను పిల్లలు మరోసారి వల్లె వేసుకున్నారు. పొద్దుపోతోంది. నగరం మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఎప్పటి లాగే తెల్లారింది. కానీ వారి బతుకులు తెల్లారిపోయాయి. తెల్లవారినా వేలాది మంది కళ్ళు తెరవలేదు. ఏమి జరిగిందో తెలియకుండానే, చనిపోతున్నామనే విషయం కూడా తెలియకుండానే వేలాది మంది అనంత లోకాలకు వెళ్లిపోయారు. పిల్లలు, పెద్దలు, మహిళలు.. అందరూ ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా నిలిచిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు నేటితో 36 ఏళ్ళు అయ్యాయి.

1984 డిసెంబరు 2 అర్థరాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో యూనికార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన భయంకర విషవాయువు తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంకా దేశ మదిలో మెదులుతూనే ఉన్నాయి. వేల మందిని పొట్టనబెట్టుకుని, లక్షలాది మంది జీవితాల్లో ఆ దుర్ఘటన చీకట్లు నింపింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్ ఐసోసైనేట్ వాయువు కారణంగా లక్షలాది మంది జీవచ్చవాలుగా మారారు. ఈ ఘటన జరిగి నేటి 36 ఏళ్లు పూర్తయినా దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది. తరాలు మారినా ఆ రక్కసి చిమ్మిన విష వాయువు ఇంకా ఈ తరం పై కూడా ప్రభావం చూపుతోంది.

ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికి కూడా సరైన వైద్య, వసతి సదుపాయాలు, ఉపాధి కల్పించకపోవడం మన దేశంలో అమలవుతున్న చట్టాలలో ఉన్న డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. నాడు విషవాయువు ప్రభావంతో పిల్లలు అవయవాలు సక్రమంగా పనిచేయక నరకయాతన అనుభవించారు. నేటికీ అనుభవిస్తున్నారు.

మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొత్తగా పెళ్లైన మహిళలకు రోజులు గడిచేకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వారిని అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా వెళ్లగొడుతున్నారు. రోగాల బారినపడి ఇప్పటికీ అక్కడి వారికి వివాహాలు జరగడం లేదంటే దుర్ఘటన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వివాహం జరిగినా సంతానం లేమి, ఒకవేళ గర్భం దాల్చినా పుట్టిన బిడ్డల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతూ బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని ఇంకా నింపుతోంది. బాధితుల్లో చాలా మంది తల్లిదండ్రులను, పిల్లలను కోల్పోయారు. 35 ఏళ్లు గడుస్తున్నా బాధితులకు సరైన న్యాయం జరగలేదు. 

Also Read : Water Leakage, Mopadu Reservoir – మోపాడు రిజర్వాయర్‌కు గండి.. 1996 పరిస్థితిని తలుచుకుని ప్రజల ఆందోళన..

ఆండర్సన్ , అమెరికా దేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త, 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కు చైర్మన్ మరియు CEOగా వ్యవహరిస్తున్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజులకు భోపాల్ వచ్చిన ఆండర్సన్ ను అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ ఇచ్చారు, బెయిల్ తీసుకున్న తర్వాత అండర్సన్ ఎప్పుడు కోర్టులో హాజరుకాలేదు. దేశం నుంచి అండర్సన్ తప్పించుకుని పోవడానికి అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగే కారణమని ఆ రాష్ట్ర ఏవియేషన్ మాజీ డైరక్టర్ ఆర్.ఎస్.సోంధీ తాజాగా ఆరోపించారు. అండర్సన్ భోపాల్ నుంచి తప్పించుకుని వెళ్లేందుకు దోహదపడాలని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, అతి కొద్ది సమయంలో అండర్సన్ భోపాల్ విడిచి వెళ్లేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. ఈ చర్యకు తాను అయిష్టంగానే సహకరించినట్టు సోంధీ వెల్లడించారు.

ఏళ్ల తరబడి న్యాయ స్థానాల్లో విచారణ జరిగినా అండర్సన్ ఒక్క సారి కూడా విచారణకు తీసుకురాలేకపోయారు. అండర్సన్ అప్పగించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా నిర్ద్వందంగా తోసిపుచ్చింది. చివరకు అండర్సన్ అనారోగ్యంతో 29 సెప్టెంబర్ 2014న వేరొ బీచ్, ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చనిపోగా, ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించలేదు.కానీ రికార్డుల ఆధారంగా అండర్సన్  మృతిని నిర్ధారిస్తున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
 

ఒక్కో బాధితుడికీ పరిహారం కింద కేవలం రూ.25 వేలు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరినీ ఇప్పటివరకూ శిక్షించలేదని, తమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించాయో ఇదే నిదర్శనమని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనలో అప్పటికప్పుడు 2,259 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా, ఆ తరవాత ఆ సంఖ్య 3,787 గా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

2006 లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ దుర్ఘటన వల్ల 5,58,125 మంది ప్రభావితమయ్యారని, అందులో 38,478 మంది పాక్షికంగా, 3,900 మంది శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని తెలిపింది. స్వచ్చంద సంస్థలు మాత్రం దుర్ఘటన జరిగిన రెండు వారాల లోపు 8 వేల మంది చనిపోయారని, ఆ తర్వాత విష వాయువు ప్రభావంతో మరో 8 వేల మంది చనిపోయారని పేర్కొన్నాయి. 92 ఏళ్ల వయస్సులో 2014 సెప్టెంబర్ 29న అండర్సన్ చనిపోయినా అతని వల్ల నేటికీ బాధితులు అనారోగ్య సమస్యలతో ప్రాణాలతో పోరాటం చేస్తూనే ఉన్నారు.

Also Read : WHO కూడా భ‌య‌పెడుతోంది కానీ..!

Show comments