ఆరోజు ఏం జ‌ర‌గ‌బోతోంది..విప‌క్షం ఏం ఆశిస్తోంది?

ఇప్పుడు అంద‌రి దృష్టి జ‌న‌వ‌రి 20 వైపు మ‌ళ్లింది. ఆరోజు ఏపీ క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ స‌మావేశాల‌కు రంగం సిద్ధం అవుతోంది. మూడు రాజ‌ధానుల విష‌యంలో పూర్తిస్థాయిలో స్ప‌ష్ట‌త రాబోతోంది. అమ‌రావ‌తి ప్రాంతం విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రి వెల్ల‌డికాబోతోంది. అసెంబ్లీలోనూ చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఆ మ‌రుస‌టి రోజు శాస‌న‌మండ‌లి నిర్వ‌హించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఆరోజు ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న‌దానిపై ఆస‌క్తి రేగుతోంది. ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ మొద‌ల‌య్యింది. ఇప్ప‌టికే డిసెంబ‌ర్ 17న అసెంబ్లీ సీఎం చేసిన ప్ర‌క‌ట‌న‌, అదే నెల 20న జీఎన్ రావు క‌మిటీ, మొన్న‌టి 3వ తేదీన బోస్ట‌న్ గ్రూప్ క‌న్స‌ల్టెన్సీ ఇచ్చిన రిపోర్ట్ కూడా తీవ్ర క‌ల‌క‌లం రేపాయి. హైప‌వ‌ర్ క‌మిటీ ఈ ప‌రిణామాల‌న్నింటినీ ప‌రిశీలిస్తోంది. ఇప్ప‌టికే రెండుమార్లు స‌మావేశ‌మ‌య్యారు. పలు అంశాలు చ‌ర్చించారు. మ‌రోసారి స‌మావేశం కావాల‌ని క‌మిటీ నిర్ణ‌యించింది. తుది నివేదిక‌ను క్యాబినెట్ తో పాటు అసెంబ్లీలోనూ స‌మ‌ర్పిస్తామ‌ని హైప‌వ‌ర్ క‌మిటీ చెబుతోంది.

దాంతో 20వ తేదీన తీసుకోబోయే కీల‌క నిర్ణ‌యం ఏపీ భ‌విత‌వ్యాన్ని నిర్ధేశించ‌బోతోంది. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి రైతుల ఆందోళ‌న తార‌స్థాయికి చేరుతోంది. వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ముందు పీఠిన నిలిపి ఈ ఆందోళ‌నలు సాగిస్తుండ‌డం విశేషం. గ‌త క్యాబినెట్ మీటింగ్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 27న ఆందోళ‌న మిన్నంటింది. ఏకంగా సెక్ర‌టేరియేట్ దారిలో ఆందోళ‌న‌లు సాగించేందుకు ప్ర‌య‌త్నించ‌డం, ఆ సంద‌ర్భంలో ఎస్ ఆర్ ఎం యూనివ‌ర్సిటీ బ‌స్సు అద్దాలు ధ్వంసం, ఆ వెంట‌నే మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి వంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. దాంతో ఈసారి ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.

ఇప్ప‌టికే జైల్ భ‌రో విప‌క్ష నేత‌లు కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు. దాంతో పెద్ద‌స్థాయిలో ర‌చ్చ చేసే అవ‌కాశం ఉంటుందనే అంచ‌నాలో ఇంటిలిజెన్స్ వ‌ర్గాలున్నాయి. దానికి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. అందుకు తోడుగా శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా అక్టోప‌స్ బృందాల‌తో పాటు ఇత‌ర ర‌క్ష‌ణ ద‌ళాలు బ‌రిలో దింపే అవ‌కాశాలున్నాయి. దాంతో ఇటు పోలీస్ యంత్రాంగం, అటు నిర‌స‌నకారుల ప్ర‌య‌త్నాల మ‌ధ్య అమ‌రావ‌తిపై తుది నిర్ణ‌యం విష‌యంలో ప్ర‌భుత్వం ఏమేర‌కు వారికి ఉప‌శ‌మనం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌ది చూడాల్సిన అంశం.

Show comments