Idream media
Idream media
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. 2024 ఎన్నికల గురించి ఇప్పటికే రాజకీయంగా చర్చ మొదలైంది. అటు నేతలు, ఇటు ప్రజల్లోనూ రాబోయే ఎన్నికలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. టిక్కెట్, గెలుపు, ఓటములపై ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరు ఉంటారు..? గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి..? టిక్కెట్ కోసం ఎవరి మధ్య పోటీ ఉంటుంది..? ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు..? అనే అంశాల చుట్టూ ఈ చర్చ సాగుతోంది.
ఈ చర్చల్లో టీడీపీ ప్రస్తావన నామమాత్రంగా ఉంటుండగా… ముఖ్యంగా అధికార పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో 175 సీట్లకు గాను వైసీపీ 151 సీట్లను గెలుచుకుంది. అందులో దాదాపు సగం మంది కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన జగన్.. తన పరపతిని మరింత పెంచుకున్నారు. కరోనా వంటి విపత్తు సమయంలోనూ ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసి తన విశ్వసనీయతను, పెద్దమనసును చాటుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలతో ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చి.. దేశంలోని ఇతర రాష్ట్రాలను ఏపీ వైపు చూసేలా చేశారు. అర్హతే ఆధారంగా, పేదల బతుకులు మారేలా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. జగన్ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. తండ్రిని మించిన కుమారుడుగా వైఎస్‌ఆర్ పేరును మరింతగా జగన్ ఇనుమడింపజేశారు.
ప్రజల్లో జగన్‌కు ఉన్న క్రేజ్‌ను గమనించిన పలువురు నేతలు, వివిధ రంగాల్లో ఉంటూ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టిక్కెట్ దక్కితే చాలు.. అసెంబ్లీలో కూర్చున్నట్లేనని భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే వివిధ మార్గాల్లో ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈ జాబితాలో ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ప్రజల అభిమానం గెలుచుకోవాలంటే.. నిత్యం వారి మధ్యనే ఉండాలని జగన్ పదే పదే చెబుతున్నా.. చాలా మంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వారంలో మూడు రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలని సీఎం జగన్ చెప్పినా.. అధికశాతం ఎమ్మెల్యేలు ఆ విషయంపై ఉదాసీనంగా ఉన్నారు.
సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకుంటానని జగన్ చెప్పడంతో.. ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయిస్తారని అందరికి స్పష్టంగా అర్థమైంది. పనితీరు సరిగాలేని, ప్రజల్లో మంచి పేరు లేని వారికి ఈ సారి టిక్కెట్లు దక్కే అవకాశం లేనట్లుగా స్పష్టమవుతోంది. అందుకే వైసీపీ టిక్కెట్ రేసులో నిలిచేందుకు నేతలు.. ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. టిక్కెట్ దక్కిందంటే గెలుపు నల్లేరుమీద నడకే కానుంది. గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ తరపున పోటీ చేసేందుకు పోటీ లేకపోగా.. ఓడిపోతామనే భయంతో చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి చూపలేదు. శ్రీశైలం వంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు బలవంతం చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీలో అందుకు భిన్నంగా టిక్కెట్ల కోసం డిమాండ్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read : ఇవిగో లెక్కలు.. అవన్నీ తప్పుడు రాతలు : అప్పులపై దుష్ప్రచారంపై దువ్వూర