Samajwadi Party, Akhilesh Yadav, IT Raids – ఇరకాటంలో అఖిలేష్..సమాజ్‌వాదీ నేత ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు

వర్తమాన రాజకీయాల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది అనటంలో ఎవరికీ సందేహం లేదు.ఇక అసెంబ్లీ ఎన్నికల వేళ దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న యూపీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత ఇంట్లో డబ్బుల కట్టలు గుట్టలుగా బయట పడటంతో కలకలం రేగింది.

చేతిలో ఉన్న అధికారంతో ఎన్నికల వేళ ప్రతిపక్షాల ఆర్థిక మూలాలను దెబ్బ తీయడంలో మోడీ సర్కార్ ఓ ఆకు ఎక్కువే చదివింది. అలాంటిది తమకు ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తమ ప్రత్యర్థి సమాజ్‌వాదీని దెబ్బకొట్టేందుకు ఎదురు చూస్తున్న బీజేపీకి అఖిలేష్ స్నేహితుడే చిక్కడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్ఫూర్‌లోని పర్ఫ్యూమ్ తయారీ సంస్థ యజమాని అయిన పీయూష్ జైన్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఐటీ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయన ఇంట్లోని రెండు అల్మారాల్లో నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న కొన్ని కట్టలు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని విప్పి చూసిన అధికారులు అవన్నీ కరెన్సీ నోట్ల కట్టలని గుర్తించారు. దీంతో బ్యాంక్ అధికారులను పిలిపించి ఆ డబ్బును లెక్కిస్తున్నారు. అందులో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా రూ.150 కోట్లకు పైగా సొమ్ము ఇప్పటికే బయటపడింది. ఇంకా నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతోంది.

మరోవైపు జీఎస్‌టీ అధికారులు కూడా పీయూష్ జైన్ ఇంటికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయన ఇన్‌ వాయిస్‌లు, వే బిల్లులు లేకుండానే మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు విచారణలో తేల్చారు. కన్నౌజ్‌లో ఉన్న పీయూష్ జైన్ ఫ్యాక్టరీలో తయారైన పెర్ఫ్యూమ్ ముంబైకి వెళ్తుందని, అక్కడి నుంచి దేశ విదేశాలకు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాలో రెండు, ఇండియాలో మరో రెండిటితో సహా పీయూష్ జైన్‌కు దాదాపు 40 కంపెనీలు ఉన్నాయని అధికారులు లెక్క తేల్చారు.అయితే ఫేక్ కంపెనీల ద్వారా నకిలీ ఇన్ వాయిస్‌లను సృష్టించి తద్వారా ట్యాక్స్, జీఎస్టీలను భారీగా ఎగవేసినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా 200 ఫేక్ ఇన్ వాయిస్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక వ్యాపారవేత్త పీయూష్ జైన్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. దీంతో బీజేపీ సమాజ్‌వాదీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడింది. ఇటీవల తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజ్‌వాదీ పేరుతో స్పెషల్ పెర్ఫ్యూమ్ బాటిల్‌లను అఖిలేష్ విడుదల చేశారు.ఈ పర్ఫ్యూమ్‌ బాటిల్స్‌ను పీయూష్ జైన్ కంపెనీ తయారు చేసింది. దీంతో సమాజ్‌వాదీ పెర్ఫ్యూమ్ అవినీతి కంపు కొడుతోందని బీజేపీ విరుచుకుపడింది. బయటపడ్డ నోట్ల కట్టల ఫొటోలు, పర్ఫ్యూమ్ విడుదల ఫొటోలను కలిపి ట్విటర్‌లో బీజేపీ షేర్ చేస్తూ “పర్ఫ్యూమ్‌ అంటేనే సువాసన.కానీ అది ఎస్పీ చేతుల్లోకి వెళితే మాత్రం కంపు కొడుతుంది.ఎస్పీ అంటేనే అవినీతి. ఆ పార్టీకి ఇది కొత్త కాదు” అని వ్యంగాస్త్రాలు సంధించింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీయూష్ జైన్‌పై ఐటీ దాడులతో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారీ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

Show comments