Arjun Suravaram
Rajasthan: కుటుంబ వేధింపులు తాను ఎదుర్కొంటున్నాను అంటూ ఓ మాజీ మంత్రి కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య, కుమారుడు తనకు భోజనం పెట్టకుండా తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Rajasthan: కుటుంబ వేధింపులు తాను ఎదుర్కొంటున్నాను అంటూ ఓ మాజీ మంత్రి కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య, కుమారుడు తనకు భోజనం పెట్టకుండా తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Arjun Suravaram
సాధారణంగా వేధింపులు అనేవి మహిళల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మగవారికి జరిగినప్పటికీ ఎక్కువగా బయటకు రావు. భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ కొందరు మహిళలు పోలీస్ స్టేషన్ , కోర్టు మెట్లు ఎక్కుతుంటారు. తమకు న్యాయం చేయాలని కోర్టులను కోరుతుంటారు. మరికొందరు అయితే మాజీ మంత్రులు, మంత్రుల దగ్గరకు వెళ్లి..తమ సమస్యను చెప్పుకుంటారు. కానీ అదే తరహా కుటుంబ వేధింపులు తాను ఎదుర్కొంటున్నాను అంటూ ఓ మాజీ మంత్రి కోర్టు మెట్లు ఎక్కారు. తన భార్య, కుమారుడు వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తనయుడు అనిరుధ్, భార్య దివ్యా సింగ్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య, కుమారుడు తనని వేధిస్తున్నారని ఈ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ వాపోయారు. తనపై దాడికి తెగబడ్డారని, సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నెలకు రూ.5 లక్షల చొప్పున భరణం ఇప్పించాలని ఆయన కోర్టును కోరారు. విశ్వేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన భార్య, కుమారులు స్పందించారు. తామే అసలైన బాధితులమని వారు చెప్పుకొచ్చారు. విశ్వేంద్ర సింగ్ భరత్‌పూర్ రాజకుటుంబానికి చెందిన వారు. వారు గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుంచి వారి కుటుంబంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో వేసిన పిటిషన్ లో కొన్ని అంశాలను ప్రస్తావించారు. తన నివాసమైన మోతీ మహల్ నుంచి బలవంతంగా గెంటేశారని, కేవలం ఒక జత దుస్తులతోనే సంచారిగా జీవిస్తున్నాని ఆయన చెప్పుకొచ్చారు. భరత్‌పూర్‌కు వస్తే ఇంట్లోకి రానివ్వడం లేదని, ఆస్తి మొత్తం సొంతం చేసుకోడానికి తన భార్య, కుమారుడు కలిసి తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని భావించానని, కానీ అది కలేనని తేలిపోయిందని, తన గది తాళలు లాగేసుకుని బయటకు గెంటేశారని, తిండిపెట్టడంలేదని స్థానిక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నానని, తన ఆస్తికి సంబంధించినవి అన్ని మాయం చేశారని, ఈ నేపథ్యంలో తనకు నెలకు రూ.5 లక్షల భరణం తోపాటు మోతీ మహల్‌ను తిరిగి ఇప్పించాలని ఆయన కోర్టును కోరారు.
అయితే, విశ్వేంద్ర సింగ్ చేసిన ఆరోపణలను ఆయన కుమారుడు అనిరుధ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని, న్యాయస్థానంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఈ మాజీ మంత్రి కొడుకు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టులో సమర్పిస్తామని, ఈ వివాదం కొత్తదేమీ కాదని అనిరుధ్ సింగ్ తెలిపారు. మొత్తంగా ఈ మాజీ మంత్రి కోర్టు లో వేసిన పిటిషన్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.