Venkateswarlu
Venkateswarlu
‘‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడద’’ని భారతీయ న్యాయ వ్యవస్థ చెబుతోంది. అందుకే శిక్షలు ఖరారు చేసే విషయంలో అన్ని కోణాలనుంచి విచారణ జరిగిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. నూటికి తొంభై శాతం కేసుల్లో ఈ కారణంగానే తుది తీర్పులో జాప్యం జరుగుతూ ఉంటుంది. తుది తీర్పులు రావటానికి 50కి పైగా ఏళ్లు పట్టిన కేసులు చాలానే ఉన్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా బిహార్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన నిలిచింది. ఈ సంఘటనలో 2 రూపాయల లంచం తీసుకున్న కేసుకు సంబంధించి.. 37 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది.
నిందితులను కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 1986లో బిహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ పరిధికి చెందిన ఐదుగురు పోలీసులు అక్కడి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. జూన్ 10న ఓ వ్యక్తి వీరిపై ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. ఆ ఐదుగురు వాహనదారుల నుంచి 2 రూపాయల లంచం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో స్వయంగా ఎస్పీనే రంగంలోకి దిగాడు. వారిని పట్టుకోవటానికి ఫిర్యాదు చేసిన వ్యక్తితో కలిసి ఓ ప్లాన్ వేశాడు. ఆ పోలీసులు లంచం అడిగినపుడు తాను సంతకం చేసిన రెండు రూపాయల నోటు ఇవ్వమని ఆ వ్యక్తికి చెప్పాడు.
అతడు చెక్‌పోస్ట్ దగ్గరకు పోగానే పోలీసులు లంచం అడిగారు. దీంతో ఎస్పీ సంతకం చేసిన నోటును ఇచ్చాడు. తర్వాత ఈ విషయాన్ని ఎస్పీకి చెప్పాడు. ఎస్పీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. 1986లో ఈ కేసు కోర్టుకు చేరింది. ఇక, అప్పటినుంచి విచారణ నడుస్తూనే ఉంది. ఈ విచారణ దాదాపు 37 ఏళ్ల పాటు కొనసాగింది. ఎట్టకేలకు తాజాగా, ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు. సరైన ఆధారాలు లేని కారణంగా ఆ ఐదుగురు నిర్ధోషులంటూ తీర్పునిచ్చారు. మరి, 37 ఏళ్ల తుది తీర్పు రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.