Vikram, Top Gun కమల్ & టామ్ క్రూజ్ – భలే కుదిరిందే

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కు మన లోకనాయకుడు కమల్ హాసన్ కు సంబంధం ఏమిటనే డౌట్ వచ్చిందా. విషయం వింటే ఆశ్చర్యం కలగక మానదు. అదేంటో చూద్దాం. వచ్చే నెల 3న విక్రమ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతిలతో పాటు గెస్ట్ రోల్ లో సూర్య నటించడంతో అంచనాలు మాములుగా లేవు. విజయ్ తో మాస్టర్ తీసి కమర్షియల్ వింగ్ లోకి వచ్చేసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు తెలుగు బిజినెస్ క్రేజీగా జరుగుతోంది. ఎనిమిది కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్మారని ట్రేడ్ రిపోర్ట్. కమల్ హాసన్ మార్కెట్ కి ఇక్కడిది పెద్ద మొత్తమే.

సరిగ్గా 36 సంవత్సరాల క్రితం 1986 ఇదే విక్రమ్ టైటిల్ తో కమల్ ఓ మూవీ చేశారు. సత్యరాజ్ విలన్ కాగా షోలే అంజాద్ ఖాన్ ఓ ముఖ్యమైన పాత్ర చేశారు. ఇళయరాజా బెస్ట్ ఆల్బమ్స్ లో ఇదీ ఒకటి. అప్పట్లో ఇది పెద్ద హిట్టు. స్పై ఏజెంట్ గా కమల్ విన్యాసాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఏజెంట్ విక్రమ్ 007 పేరుతో డబ్బింగ్ చేస్తే ఇక్కడా బాగానే ఆడింది. ఇక టామ్ క్రూజ్ సంగతి చూద్దాం. ఇతని లేటెస్ట్ మూవీ టాప్ గన్ మావెరిక్ ఈ 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ హీరో కావడంతో హైప్ ఓ రేంజ్ లో ఉంది.

ఈ టామ్ క్రూజ్ 1986లో టాప్ గన్ చేశారు. అప్పటిదాకా ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న ఇతగాడికి ఈ సినిమా సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చేసింది. అక్కడి నుంచి వెనుదిరగాల్సి అవసరం పడలేదు. కట్ చేస్తే ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత ఆ టాప్ గన్ కొనసాగింపు చేయడం విశేషం. కమల్ హాసన్, టామ్ క్రూజ్ లకు సారూప్యత ఇక్కడే ఉంది. 1986లో విక్రమ్, టాప్ గన్ లు చేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు అవే టైటిల్స్ ని రిపీట్ చేస్తూ ఒకే ఏడాది కేవలం వారం గ్యాప్ లో రావడం విశేషం. సోషల్ మీడియాలో దీని గురించి ఫ్యాన్స్ చేస్తున్న ట్రెండింగ్ జోరుగా ఉంది. యాదృచ్చికంగా జరిగిందే అయినా ఆసక్తికరంగా అనిపించే సంఘటన ఇది.

Show comments