రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటుడు రాజా!

ప్రముఖ నటుడు రాజా ఏబెల్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2002లో వచ్చిన ‘ఓ చిన్నదాన’ సినిమాతో ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హీరోగా పదికిపైగా సినిమాల్లో నటించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన.. 2004లో వచ్చిన ‘ఆనంద్‌’సినిమాతో తొలిసారి సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసినా.. హీరోగా ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

సెకండ్‌ లీడ్‌ రోల్స్‌ ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2013 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజకీయాలనుంచి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం పాస్టర్‌గా దైవ సేవలో తరిస్తున్నారు. అలాంటి ఆయన మరో సారి రాజకీయాల వైపు దృష్టి మళ్లించారు. తాజాగా, కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిక సందర్భంగా రాజా మాట్లాడుతూ.. రాజకీయాలు తనకు కొత్తేమీ కాదన్నారు. ఇంతకు ముందు తాను తెర వెనుక ఉండి పని చేశానని, ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి పని చేస్తానని అన్నారు. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాకుండా.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకోసం పని చేస్తానని అన్నారు. తెలుగు ప్రజలకు సేవ చేయడానికే కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్నారు. మరి, ప్రముఖ నటుడు రాజా ఏబెల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments