మహిళల పేరు మీద ఇల్లు కొంటే.. రూ.6 లక్షలు ఆదా.. ఎలాగో తెలుసుకొండి

మహిళల పేరు మీద ఇల్లు, స్థిరాస్తి వంటివి కొనుగోలు చేస్తే లక్షల్లో డబ్బులు ఆదా చేయవచ్చు. ఎలా అంటే..

మహిళల పేరు మీద ఇల్లు, స్థిరాస్తి వంటివి కొనుగోలు చేస్తే లక్షల్లో డబ్బులు ఆదా చేయవచ్చు. ఎలా అంటే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారితకు పెద్ద పీట వేస్తున్నాయి. వారు ఆర్థికంగా స్వతంత్రం సాధించి.. తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడం కోసం ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు ప్రారంభిస్తున్నాయి. ఇక బ్యాంకులు కూడా మహిళల కోసం అనేక రకాల స్కీమ్స్‌ తీసుకువచ్చాయి. వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. ఈక్రమంలో మహిళల పేరు మీద ఇల్లు తీసుకుంటే సుమారు ఆరు లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు అంటున్నారు రియల్‌ఎస్టేట్‌, బ్యాంక్‌ నిపుణులు. ఎలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం..

రియల్‌ ఎస్టేట్‌లో మహిళల పేరు మీద పెట్టుబడిని ప్రోత్సాహించడం కోసం బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు సైతం.. తక్కువ వడ్డీ రేట్లతో హోమ్‌ లోన్స్‌ను ఇస్తాయి. పురుషులతో పోలిస్తే మహిళలకు ఇచ్చే హోమ్‌ లోన్స్‌పై బ్యాంకులు 5-10 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు ఇస్తాయి. అయితే ఇది బ్యాంకుల వారీగా మారుతుంది. అలానే క్రెడిట్‌ స్కోర్‌పైనా ఆధారపడి ఉంటుంది. చిన్న తగ్గింపే కదా అని చిన్న చూపు చూడకండి. ఇదే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో వడ్డీని ఆదా చేస్తుందనే సంగతి మర్చిపోకూడదు.

ఉదాహరణకు ఓ వ్యక్తి తన పేరు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తీసుకుంటే, దానికి ప్రారంభ వడ్డీ రేటు 9.15 శాతం. కానీ ఎస్‌బీఐ.. మహిళలకు 0.05 శాతం మినహాయింపు ఇస్తుంది. మహిళలకు వడ్డీ రేట్లు 9.10 శాతం నుండి ప్రారంభమవుతాయి. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ గృహ లక్ష్మి పథకంలో మహిళలకు గృహ రుణ వడ్డీ రేటు 8.35-9.25శాతం. ఇతరులకు 8.5-9.5 శాతం వరకు ఉంటుంది.

దీని ప్రకారం సదరు వ్యక్తి బ్యాంక్ నుండి తన పేరు మీద 1 కోటి రూపాయల రుణం తీసుకుంటే, అతని ఈఎంఐ 93,213 రూపాయలు అవుతుంది. అతను 20 సంవత్సరాలలో 1.23 కోట్ల రూపాయల వడ్డీని చెల్లించాలి. అదే వ్యక్తి.. ఆ లోన్‌ను తన పేరు మీద కాకుండా తన భార్య పేరు మీద తీసుకుంటే.. వడ్డీ రేటు 9.10 శాతానికికి పడిపోతుంది. అప్పుడు ఈఎంఐ మొత్తం కూడా 91,587 రూపాయలకు తగ్గుతుంది. చివరకు అంటే 20 ఏళ్లలో అతడు 1.19 కోట్ల వడ్డీని చెల్లిస్తాడు. అంటే భార్య పేరు మీద లోన్‌ తీసుకుంటే.. ఆ వ్యక్తి ఈఎంఐలో నెలకు దాదాపు 2,000 రూపాయలు ఆదా చేయగలడు. అలా 20 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల రూపాయల వడ్డీని కూడా సేవ్ చేస్తాడు.

అందుకే హోమ్‌ లోన్‌ తీసుకునే ముందు మహిళల పేరు మీద ఉన్న రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు గురించి బ్యాంక్‌ని అడగండి. ఆడవాళ్లు కూడా సంయుక్తంగా లోన్‌ తీసుకుంటే బ్యాంకులు కూడా వడ్డీ రేటు మీద తగ్గింపు ఇస్తాయి. పైగా మీ భార్య సహరుణగ్రహీతగా ఉండటం వల్ల మరో లాభం ఏంటంటే.. ఇద్దరి ఆదాయాలను కలపడం వలన మీ లోన్ అర్హత మరింత పెరుగుతుంది.. మీ కలల ఇంటి కోసం ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవచ్చు.

స్టాంప్‌ డ్యూటీలో కూడా రాయితీ..

ఇంటి కొనుగోలుతో ముడిపడి ఉన్న మరో ముఖ్యమైన అంశం.. స్టాంప్ డ్యూటీ. స్థిరాస్తి కొనుగోలు చేసినప్పుడు స్టాంపు డ్యూటీ కచ్చితంగా చెల్లించాలి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు తమ పేరుతో ఇల్లు కొనుగోలు చేస్తే.. వారికి స్టాంప్ డ్యూటీలో రాయితీని ఇస్తున్నాయి. వారు ఆస్తికి ఉమ్మడి యజమానులుగా ఉన్నప్పుడూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. వేర్వేరు రాష్ట్రాల్లో ఈ స్టాంప్‌ డ్యూటీ వేరు వేర్వుగా ఉంటుంది

ఉదాహణరకు ఓ వ్యక్తి.. ఢిల్లీలో రూ.1 కోటి విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తున్నాడనుకుందాం. అక్కడ స్టాంప్‌ డ్యూటీ పురుషులకు 6 శాతం ​కాగా.. మహిళలకు 4 శాతం. ఇక సదరు వ్యక్తి తన పేరు మీద ఆస్తి కొనుగోలు చేస్తే.. రూ. 6 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. అదే తన భార్య పేరు మీద ఆస్తిని కొనుగోలు చేస్తే, అతను స్టాంప్ డ్యూటీగా కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించిస్తే సరిపోతంది. దీని వల్ల ఆ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం.

మహిళలను ఇంటి యాజమానులుగా చేయడానికి, భారత ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించింది. వీటి ద్వారా కూడా మహిళలు వడ్డీ రాయితీలు పొందుతారు. వీటిల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఒకటి. సీఎల్‌ఎస్‌ఎస్‌ అని పిలిచే.. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఆప్షన్ దీనికి ఉంది. ఈ పథకం కింద, ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాల మహిళలు సబ్సిడీలు పొందుతారు. ఈ పథకం కింద ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి రుణం తీసుకునే వ్యక్తులు 2.67 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీని పొందవచ్చు.

మగవారితో పోలిస్తే.. మహిళలకు కలిగే రెండు అదనపు ప్రయోజనాలు ఏమిటంటే.. వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీ రాయితీలు. హోమ్ లోన్ అసలు, వడ్డీపై పన్ను మినహాయింపులు.. వడ్డీ రాయితీలు వంటి ప్రయోజనాలు.. మగవారు, మహిళలు.. ఇద్దరికీ అందుబాటులో ఉంటాయి. అలా మీ భార్య పేరు మీద ఇల్లు కొంటే వడ్డీ పరంగా 4 లక్షలు, స్టాంప్‌ డ్యూటీ పరంగా 2 లక్షలు మొత్తంగా రూ.6 లక్షల రూపాయలు సేవ్ చేయవచ్చు. కనుక ఇల్లు కొనే ముందు మహిళల పేరు మీద బ్యాంకులు అందిచే రాయితీల గురించి తెలుసుకోవడం మర్చిపోవద్దు.

Show comments