తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. అనేక ఇళ్లలోకి నీరు చేరడంతో.. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ వాన నుంచి ఎప్పుడు బయట పడతామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే వరణుడు మాత్రం వదల బొమ్మాలీ..మిమల్ని వదలా అన్నట్లు రోజూ పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.

మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అక్కడ నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్‌ వరకు ఈ ఆవర్తన ద్రోణి విస్తరించింది. అలానే బుతుపవనద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలోని కోస్తాలో చురుగ్గా కదులుతున్నాయి. అలాగే వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది..

రానున్న రెండు  రోజుల్లో ఉత్తర కోస్తాలో అనేక ప్రాంతాల్లో, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా కోస్తా తీరంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా, పార్వతీపురం మన్యం భారీ వర్షాలు కురుస్తాయని  తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఆదివారం విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా  వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. సోమవారం  ఉమ్మడి మెదక్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో బుధవారం వరకూ వర్షాలు పడతాయి అంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేశారు.

 

Show comments