కొత్తపార్టీ గురించి క్లారిటీ ఇచ్చిన బ్రదర్ అనిల్

కొత్తపార్టీ గురించి క్లారిటీ ఇచ్చిన బ్రదర్ అనిల్

క్రైస్తవమత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ కీలక అడుగులు వేస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల ఆయన రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో భేటి అయ్యారు. సుదీర్ఘ చర్చలు జరిపారు. తన సన్నిహితులతో సమావేశాల్లో భాగంగా సోమవారం విజయవాడలో ఆయన మీటింగ్ నిర్వహించారు. వివిధ బిసి సంఘాల నేతలు హాజరయ్యారు.

అనిల్ భార్య , ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల తన పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఆగిపోయిన పాదయాత్ర మళ్ళీ మొదలెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ వైసీపీ ద్వారా ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రభావం కోసం యత్నిస్తున్నారు. అలాంటి సమయంలో బ్రదర్ అనిల్ ఏపీలో రాజకీయ ప్రస్థానం కోసం ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. అయితే తాను పార్టీ పెట్టడం లేదంటూ విజయవాడలో మీడియాతో అనిల్ అన్నారు. కేవలం సమస్యలపై చర్చించేందుకే వచ్చానని అన్నారు. మత సంబంధిత వ్యవహారాల్లో బిజీగా ఉండే అనిల్ సమస్యల గురించి సమావేశం పెట్టారంటే దాని వెనుక వ్యూహం ఉంటుందనడంలో సందేహం లేదు.

రాజకీయంగా వైఎస్సార్ ఉన్న నాటి నుంచి అనిల్ పేరు ప్రస్తావనలోకి వచ్చేది. గతంలో బయ్యారం గనుల వ్యవహారంలో అనిల్ చుట్టూ వివాదం కూడా రాజుకుంది. ఏపీలో జగన్ సర్కారు జనాదరణతో సాగుతోంది. ఈ సమయంలో అనిల్ సమావేశం నిర్వహించడం, అక్కడికి హాజరైన నేతలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని పేర్కొనడం చర్చనీయాంశం. ఏపీలో ఇప్పటికే విపక్షం ప్రజలమద్దతు కూడగట్టలేకపోతోంది. జనసేన ప్రభావం పరిమితంగా ఉంది. దాంతో కాపు నేతలు కొందరు రాజకీయ పార్టీ ఆలోచనలో ఉన్నారు. అదే వరుసలో బ్రదర్ అనిల్ బిసి నేతలతో సమావేశం ద్వారా ఏమి సాధిస్తారన్నది చూడాలి. వైఎస్సార్టీపీ
ని జాతీయ పార్టీగా మార్చే యోచన ఆయనకి ఉందని భావిస్తున్నారు. అది సాధ్యమా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.

Show comments