Extra Ordinary Man Movie Review & Rating In Telugu: నితిన్ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌' మ్యాన్ రివ్యూ!

Extra Ordinary Man Review in Telugu: నితిన్ ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’ మ్యాన్ రివ్యూ!

Nithiin's Extra Ordinary Man Review & Rating In Telugu: నితిన్- వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందో.. లేదో ? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

Nithiin's Extra Ordinary Man Review & Rating In Telugu: నితిన్- వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందో.. లేదో ? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్

20231208, U/A
యాక్షన్ కామెడీ డ్రామా
  • నటినటులు:నితిన్, రాజశేఖర్, సంపత్ రాజ్, శ్రీలీల, రావు రమేశ్, తదితరులు
  • దర్శకత్వం:వక్కంతం వంశీ
  • నిర్మాత:సుధాకర్ రెడ్డి
  • సంగీతం:హ్యారిస్ జయరాజ్
  • సినిమాటోగ్రఫీ:ఆర్థర్ ఏ విల్సన్, H యువరాజ్

2

“భీష్మ” తరువాత సరైన హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న హీరో నితిన్. “నా పేరు సూర్య” చేదు ఫలితం తరువాత దర్శకుడుగా సక్సెస్ టేస్ట్ చూడాలన్న కసితో ఉన్న దర్శకుడు వక్కంతం వంశీ. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం.. హీరోకి, దర్శకుడుకి విజయాన్ని అందించిందా? లేదా? అనే విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

అభి (నితిన్) ఓ జూనియర్ ఆర్టిస్ట్. నటుడిగా తనని తాను నిరూపించుకోవాలని కష్టపడుతుంటాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అతని తండ్రి బలవంతం, పరిస్థితుల కారణంగా అభి ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. అనుకోకుండా పరిచయం అయిన లిఖిత(శ్రీలీల)కి ఓ సాయం చేయడంతో అభికి మంచి ఉద్యోగం వస్తుంది. లైఫ్ లో సెటిల్ అయ్యాడనుకుంటున్న సమయంలో అభిని వెతుక్కుంటూ ఓ డైరెక్టర్ వస్తాడు. ఆంధ్ర- మహారాష్ట్ర బోర్డర్ లో ఉండే  ఓ 10 గ్రామాల కష్టాన్ని కథగా మలిచి, అందులో అభిని హీరోగా పెట్టి సినిమా తీస్తానని మాట ఇస్తాడు. ఇక్కడ నుండి అభి లైఫ్ లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? రీల్ లైఫ్ లో అభి హీరో అయ్యాడా? ఆ 10 గ్రామాల కష్టం అభి జీవితాన్ని ఎలా మార్చింది అన్నదే ఈ చిత్ర కథ.

విశ్లేషణ:

కిక్-2 సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. తరువాత.. ఆ చిత్ర రచయత వక్కంతం వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా పరాజయానికి కారణం చెప్పాడు. “తనది కాని కష్టాన్ని హీరో తనదిగా ఫీల్ అవ్వాలంటే కాన్ఫ్లిక్ట్ పాయింట్ చుట్టూ ఎమోషన్ సరిగ్గా పండాలి. అప్పుడు హీరో ఏమి చేసినా ప్రేక్షకుడు ఆస్వాదిస్తాడు. కానీ.., ఆ ఊరి ప్రజల కష్టాన్ని సరిగ్గా చూపించడంలో మేము విఫలం అయ్యాము. ఇందుకే కిక్-2 ఆడలేదు” ఇది అప్పట్లో వంశీ ఇచ్చిన వివరణ. వందకి వంద శాతం అది నిజం కూడా. కానీ..,  ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’ సినిమా విషయంలో కూడా వంశీ ఇదే తప్పు రిపీట్ చేయడం షాకింగ్ గా అనిపిస్తోంది.

‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’ మూవీ ఓ మంచి ఫీల్ తో స్టార్ట్ అవుతుంది. సరదాగా ఉండే ఓ కుర్రాడి క్యారెక్టర్,  కొడుకు-తండ్రి మధ్య హిలేరియస్ కామెడీ సీన్స్, ఓ అందమైన అమ్మాయితో లవ్ ట్రాక్ ఇలా సాగిపోతున్న కథలో.. హీరో సాధించడానికి ఓ పెద్ద కాన్ఫ్లిక్ట్ , మంచి హై ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్.. ఓ కమర్షియల్ సినిమాకి ఇంతకు మించిన లేయర్స్ అవసరం లేదు. ఓ మంచి సినిమా కోసం అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్న దర్శకుడు ఫస్ట్ హాఫ్ లో బాగానే ఆకట్టుకున్నాడు. నిజానికి నితిన్ కి గతంలో సక్సెస్ ఇచ్చిన అన్నీ సినిమాలు ఇలా సాగినవే. దీంతో.. భీష్మ టచ్ తో నితిన్ కి మరో హిట్ పడినట్టే అని అంతా భావిస్తారు. కానీ.., కామన్ ఆడియన్ అంచనాలకు అందకుండా కథ సాగాలన్న తపనతో దర్శకుడు అనవసరపు కన్ఫ్యూజన్ ని తీసుకొచ్చి కథలో ఇరికించేసి.. సాఫీగా సాగిపోతున్న సినిమాని ట్రాక్  తప్పించేశాడు.

విలన్ ఓ గ్రామానికి వెళ్లి.. అక్కడ భూముల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది కొన్నేళ్లుగా తెలుగు సినిమాల్లో కామన్ గా సాగుతూ వస్తున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్. సరే.. ఏ లైన్ పాతదే అయినా.. అక్కడి ప్రజల కష్టాలను ఎలా ఎస్టాబ్లిష్ చేశాము, ఎంత ఎమోషనల్ గా చూపించాము అన్నది ఆడియన్ కి కావాల్సిన మెయిన్ పాయింట్. దుదృష్టవశాత్తు వంశీ అసలు ఈ రెండు ఎలిమెంట్స్ ను పూర్తిగా గాలికి వదిలేశాడు. ఎంత సేపటికీ హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్, కామెడీపైన దృష్టి పెట్టి కథని పట్టించుకోలేదు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో లాజిక్, ఎమోషన్ లేకుండా సాగే యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతాయి. మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నటీనటుల పనితీరు:

తెలుగులో ఇన్ బిల్ట్ మంచి ఈజ్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకడు. ఓ మంచి కథ దొరికితే నితిన్ తనదైన స్టయిల్ లో రెచ్చిపోతాడు. “ఎక్స్‌ట్రా” ఫస్ట్ హాఫ్ లో కూడా నితిన్ ఇలానే రెచ్చిపోయాడు.  కమెడియన్స్ ఎవ్వరూ అవసరం లేకుండా తాను ఒక్కడే కామెడీ పండించాడు. మాస్ సీన్స్ లో దుమ్మురేపేశాడు. కానీ., సెకండ్ ఆఫ్ కి వచ్చే సరికి నితిన్ చప్పపడిపోయాడు. దర్శకుడికే క్లారిటీ లేని సీన్స్  లో ఎలా నటించాలో అర్ధం కాక.. పూర్తిగా చేతులు ఎత్తేశాడు. కానీ.., నితిన్ మాత్రం తన సైడ్ నుండి ఈ మూవీ కోసం చాలానే కష్టపడ్డాడు. ఇక హీరోయిన్ శ్రీలీల. ఇందులో ఈమెకి నటించడానికి ఎలాంటి స్కోప్ గాని, స్క్రీన్ స్పేస్ గాని లేదు. కానీ.., శ్రీలీల ఇలాంటి గ్లామర్ డాల్ పాత్రలకి త్వరగా దూరం జరగకపోతే.. ఆమె కెరీర్ డేంజర్ లో పడే అవకాశం ఉంది. ఇక ఐజీగా రాజశేఖర్ తనదైన మార్క్ చూపించాడు. ఉన్నది కొంతసేపే అయినా.. స్క్రీన్ అంతా ఆక్రమించేశాడు. “ఎక్స్‌ట్రా” లో మంచిగా చెప్పుకోవాల్సింది రావు రమేశ్ నటన గురించి. అంతోఇంతో బాగున్న ఫస్ట్ హాఫ్ కి ప్రాణం పోసింది ఈ పాత్రే. ఇక విలన్ గా సుదేవ్ నాయర్ పరవాలేదు అనిపించాడు.

టెక్నికల్ విభాగం:

‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’ మూవీ టెక్నీకల్ గా బెస్ట్ టీమ్ నే సెలెక్ట్ చేసుకుంది. దీనికి చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ గా వర్క్ చేశారు. వారంతా బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి పాటలు అతి పెద్ద మైనస్. బీజీఎమ్ అదరగొట్టిన హరీశ్ పాటలు మాత్రం మనసు పూర్తిగా ఇచ్చినట్టు అనిపించడం లేదు. ఏ ఒక్క పాట కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ఇక ఎడిటింగ్ అంతా ఏదో ప్యాచ్ వర్క్ చేసి వదిలేసిన ఫీలింగ్ కలగక మానదు. చివరగా దర్శకుడిగా వక్కంతం వంశీ నుండి బెస్ట్ వర్క్ డెలివరీ కాలేదనే చెప్పుకోవాలి. ఏ క్రాఫ్ట్ పైనా పూర్తిగా పట్టు సాధించలేకపోయాడు వంశీ. ఆఖరికి తనకి అతిపెద్ద బలమైన స్క్రిప్ట్ విషయంలో కూడా వంశీ తేలిపోవడం దురదృష్టకరం.

ప్లస్:

  • ఫస్ట్ హాఫ్
  • నితిన్ ఎనర్జీ
  • రావు రమేశ్ నటన

మైనస్:

  • సెకండ్ ఆఫ్
  • ఎమోషన్ మిస్ అవ్వడం
  • లాజిక్ లేని యాక్షన్ బ్లాక్స్
  • పాటలు

చివరి మాట: ఫస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా.. సెకండ్ ఆఫ్ ఆర్డినరీ

రేటింగ్: 2/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments